అక్షర ఆయుధం : తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని ఆయన ఆరోపించారు. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని ఆయన ఆరోపించారు. వివరాలు… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు జగిత్యాల జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్రలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… జగిత్యాల నియోజకవర్గం పరిధిలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక పేరుతో బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టుకుందని అన్నారు. అయితే దీనిని బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని చెప్పుకుంటే బాగుండేదని విమర్శించారు. దాదాపు ఏడాది తర్వాత ఈ సభ కోసం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వస్తున్నారని విమర్శించారు. అయితే ఇలాంటి సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని అన్నారు. అయితే హరీష్ రావు ఈ సమయంలో ఢిల్లీ ఎందుకు వెళ్లారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని… వర్గపోరు బయటపడిందని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పటికే పార్టీకి దూరమయ్యారని… ఇప్పుడు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని అన్నారు. హరీష్ రావు ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది ఈ బహిరంగ సభ వేదికగా తెలంగాణ ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ఉంటే… జీవన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్‌కు అంత అక్కసు అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. ఇదిలాఉంటే, పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి వెళ్లిందని ఆ పార్టీ తెలిపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్న మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు ఢిల్లీ వెళ్లారని పేర్కొంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా న్యాయవాదులతో బీఆర్ఎస్ నాయకులు చర్చించనున్నారని తెలిపింది.