పయనించే సూర్యుడు న్యూస్ : మోదీ, లీ జే మ్యుంగ్ భారత్ కొరియా బిజినెస్ డైలాగ్ లో పాల్గొని కీలక ఒప్పందాలు కుదుర్చారు, వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యం పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ నేడు ‘భారత్-కొరియా బిజినెస్ లీడర్స్ డైలాగ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు పరిశ్రమల ప్రతినిధులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఉన్న ఈ సమయంలో భారత్, దక్షిణ కొరియా కలిసి శాంతి, స్థిరత్వం సందేశాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ISA), ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్‌లో చేరాలని దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రగతిశీలకంగా, శాంతియుతంగా మార్చడానికి రెండు దేశాలు కృషి చేస్తాయని చెప్పారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని, ఈ విషయంలో ఇరు దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రస్తావన వంద ఏళ్ల క్రితమే మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కొరియాను ‘తూర్పు జ్యోతి’ (Lamp of the East) అని పిలిచారని ప్రధాని గుర్తు చేశారు. ‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడంలో దక్షిణ కొరియా కీలక భాగస్వామి అని కొనియాడారు. ఈ భాగస్వామ్యం ప్రపంచ ప్రగతికి బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధికి నిదర్శనం: అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సంయుక్త విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బృందానికి లభించిన ఆతిథ్యం అద్భుతమని కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ భారత్ రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. DNA లోనే ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, చట్ట పాలనను గౌరవించడం భారత్, దక్షిణ కొరియా దేశాల DNA లోనే ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో రెండు దేశాల సంబంధాలు మరింత విస్తృతమయ్యాయని చెప్పారు. అధ్యక్షుడు లీ పర్యటనతో ఈ నమ్మకమైన బంధం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మారుతుందని పేర్కొన్నారు. చిప్స్, నౌకల తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, ఇంధన రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామని తెలిపారు. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం ప్రస్తుతం భారత్ – దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లుగా ఉందని ప్రధాని వెల్లడించారు. దీనిని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి ‘ఇండియా-కొరియా ఫైనాన్షియల్ ఫోరమ్’ ప్రారంభించినట్లు తెలిపారు. పారిశ్రామిక సహకారం కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కొరియన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు ఆర్థిక భద్రతపై చర్చలు (Economic Security Dialogue) ప్రారంభమవుతాయని ప్రధాని తెలిపారు. దక్షిణ కొరియా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి వీలుగా ‘కొరియన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్’ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాదిలో భారత్-దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందాన్ని మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. 2028లో ఫ్రెండ్‌షిప్ ఫెస్టివల్ భారత్‌లో కొరియన్ సంగీతం (K-pop), సినిమాలు (K-drama) ప్రాచుర్యం పొందుతున్నాయని ప్రధాని అన్నారు. అలాగే కొరియాలో భారతీయ సంస్కృతికి గుర్తింపు పెరుగుతోందన్నారు. అధ్యక్షుడు లీ కూడా భారతీయ సినిమాలను ఇష్టపడటం సంతోషకరమని చెప్పారు. సాంస్కృతిక బంధం కోసం 2028లో ‘భారత్-దక్షిణ కొరియా ఫ్రెండ్‌షిప్ ఫెస్టివల్’ నిర్వహిస్తామని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్‌లను అనుసంధానించేలా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు అధ్యక్షుడు లీ తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు, వ్యాపారులు తమ దేశాల్లోని స్థానిక క్యూఆర్ (QR) కోడ్‌లను ఉపయోగించి సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.