సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

వ్యక్తిగత చొరవ కోరిన కేంద్రం

అక్షర ఆయుధం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ వంటి అవసరాల నిమిత్తం భూ కేటాయింపులకు సహకరించాలని లేఖలో కోరారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్రోచ్ రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి రోడ్డు విస్తరణపై సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి కిషన్ రె్డి లేఖలో కోరారు.చర్లపల్లి రైల్వేస్టేషన్ కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల మూలంగా నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేటర్మినళ్లపై అధిక భారం పడుతుందని…ఈ సమస్యకు పరిష్కారంగా నగర పరిధిలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద రూ. 430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది అని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా 6 జనవరి 2025 న ఈ నూతన టర్మినల్‌ను ప్రారంభించుకున్నామని ఆ కార్యక్రమంలో తమరు పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్రోచ్ రోడ్లను విస్తరించాలి కొత్త రైల్వే టర్మినల్‌ను ప్రారంభించుకున్న తరువాత ప్రతి రోజూ కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున్నాయి అనికేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందువల్ల ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా రైల్వేస్టేషన్ కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు రైల్వేస్టేషన్ కు సులభంగా రాకపోకలు సాగించటానికి వీలుగా అప్రోచ్ రోడ్లను విస్తరించవలసిన అవసరం ఉంది. అలాగే పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్ కు ఇరువైపులా అవసరమైన భూసేకరణ పూర్తి చేయవలసి ఉంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. విస్తరించాల్సిన మార్గాలు ఇవే FCI గోడౌన్ రోడ్డు నుండి కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించవలసి ఉంది. భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వేస్టేషన్ కు రాకపోకలు సాగించటానికి ప్రధాన రహదారిగా మారనుంది. భరత్ నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుండి చర్లపల్లి స్టేషన్ కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఇప్పటికే 30 అడుగుల రహదారి ఉంది. దీనిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలి. EC నగర్ నుండి చర్లపల్లి స్టేషన్ లోని MMTS ప్లాట్ ఫాం ను చేరుకునే రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. EC నగర్ ప్రధాన రహదారి నుండి స్టేషన్ ను చేరుకునే ఈ రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున విస్తరించవలసిన అవసరం ఉంది. వీటితో పాటుగా చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, MMTS ప్లాట్ ఫాం వైపు 2.70 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించవలసి ఉంది. చర్లపల్లి టెర్మినల్ కు నీటి సరఫరా కనెక్షన్ ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్ల నిధులను కూడా రైల్వే శాఖ జమ చేయడం జరిగింది. ఈ నీటి కనెక్షన్ ను కూడా త్వరగా ఏర్పాటు చేయాలి. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రూ. 715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను పునరాభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ అభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్ ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉంది. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుండి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విషయాలన్నింటి పైన రైల్వే శాఖ అధికారులు, GHMC అధికారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి నివేదించడం జరిగింది అనికేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యక్తిగతంగా చొరవ తీసుకోండి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి 15 జూన్, 2022 న,07 మార్చి, 2023 న రెండు ఉత్తరాలు రాయడం జరిగింది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే 08 సెప్టెంబర్ 2024 న తమరికి కూడా ఉత్తరం ద్వారా విషయం తెలియజేశాను. అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదు అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘మీరు నేను వ్రాసిన ఉత్తరం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సమస్య పరిష్కరించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అధికారుల బృందం రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్లను పరిశీలించి చర్యలకు ఉపక్రమించినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి ఫలితం లేదు. కావున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, నగరానికి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వేస్టేషన్ కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలి’అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *