టెన్త్ రిజల్ట్స్ విడుదలకు సిద్ధం

సీపీ సజ్జనార్ నుంచి అప్రమత్తత పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మరికాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పదని ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఉందని వారి కోసం తల్లిదండ్రులు తపిస్తున్నారని ఆలోచించాలని సూచించారు. పదవ తరగతి ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జనర్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ ఫలితాలు విద్యార్థుల జీవిత గమనాన్ని శాసించేవి కావని. సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదని. అది ఆయా కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హితవు పలికారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం అత్యంత ముఖ్యం ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య కేసుల‌ను మహిళా భద్రత విభాగం అధికారులు స‌మ‌గ్రంగా దర్యాప్తు చేసి, బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయ‌ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప. జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఫలితం ఏదైనా సరే, పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఫెయిల్యూర్ అనేది తాత్కాలికం మాత్రమే ఫలితాల వెల్లడి తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించాలని, వారు ఒంటరిగా ఉన్నా లేదా మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కోరారు. అవసరమైతే పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు.ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది కేవలం తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని వారికి భరోసా కల్పించాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *