మే 10న ప్రధాని మోదీ తెలంగాణ టూర్

*3 లక్షల మందితో సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు

జనం న్యూస్ : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రారంభించేందుకు మే 10న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఇక ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు 3 లక్షల మందిని సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు రానుండటంతో బీజేపీ నేతల్లో సరికొత్త జోష్ నెలకొంది.ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ.. తెలంగాణపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ప్రధాని మోదీ .. తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మే 10వ తేదీన తెలంగాణకు రానున్నట్లు.. కాషాయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు.. ఆ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తాజాగా సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై బీజేపీ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ ఇతర బీజేపీ నేతలు హాజరై చర్చించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను ప్రధాని మోదీ సభకు తీసుకువచ్చేందుకు ఏవిధంగా ప్లాన్ చేయాలనే అంశాలపై ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నుంచి 25 వేల మందికి తగ్గకుండా జనాలను సభకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌లు భారీ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు సభలను తలదన్నేలా భారీగా జనాలను సమీకరించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ కొత్త అభివృద్ది పథకాలు ప్రకటిస్తే.. అవి బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రధాని మోదీ తెలంగాణ టూర్, బహిరంగ సభ సక్సెస్ అయితే.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఊపు వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *