పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మకుటంలో మరో మణిహారంగా నిలవనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణ ప్రక్రియలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వైభవంగా భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మకుటంలో మరో మణిహారంగా నిలవనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణ ప్రక్రియలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వైభవంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న ఈ మహానగర అభివృద్ధిలో స్థానిక రైతులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదని, తెలంగాణ భవిష్యత్తును మార్చే శక్తి అని ఆయన అభివర్ణించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చే రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వారు గర్వంగా, ఆనందంగా పరిహారం తీసుకునేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియలో రైతుల మనసుల్లో ఎలాంటి అభద్రతా భావం తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కోసం తమ సొంత భూములను త్యాగం చేసే రైతులను అధికారులు గౌరవించాలని, ముఖ్యంగా పేద రైతుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. రైతులు మరోచోట మెరుగైన భూమిని కొనుగోలు చేసేలా పారదర్శకమైన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ బృహత్తర ప్రాజెక్టు విజయవంతం కావాలంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు, కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలని ఆయన కోరారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే గ్రామాల సర్పంచ్‌లను గౌరవించాలని, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వారికి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపాలని అధికారులకు సూచించారు. తమ గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని స్థానికుల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయని, అటువంటి వారు గ్రామసభల్లో తీర్మానం చేసి కలెక్టర్లకు పంపితే తప్పకుండా పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిని పురాణాల్లోని విద్రోహ శక్తులతో పోల్చారు. ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన నేతలు ఒకవైపు, ప్రజల మధ్య తిరుగుతూ విషం చిమ్మే మరికొందరు నేతలు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన అసూయతో కొందరు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని, వారు ఎంతగా ఏడుస్తుంటే అభివృద్ధి పనులను అంత వేగంగా ముందుకు తీసుకెళ్తానని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి ఏ ఒక్క వ్యక్తితోనో లేదా పార్టీతోనో ఆగిపోయేది కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాత నగరం, కొత్త నగరం, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు ‘నాలుగో నగరం’గా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గ్లోబల్ సిటీలతో పోటీ పడేలా అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, పరిశ్రమలు, సాంకేతిక రంగాలకు ఈ నగరం చిరునామాగా మారుతుందని ఆయన వివరించారు.