సాక్షి డిజిటల్ న్యూస్ : దండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున శాసనసభలో “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు -2026” ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భద్రత కల్పించాలని అందుకు అనుగుణంగా చట్టం చేయాలని ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి ఈ బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చామని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఈ చట్టం ఒక కీలక ముందడుగని పేర్కొన్నారు. మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి… భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయే పరిస్థితులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదని అన్నారు. దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్షణతో పాటు, అనేక చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయా చట్టాల గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఇక, వృద్ధుల సామాజిక భద్రతకు సంబంధించి కూడా దేశంలో చట్టాలు ఉన్నాయని తెలిపారు. పిల్లలు తమ తల్లి దండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ మెయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2027 ఉందని చెప్పారు. అయితే ఇలా చట్టాలు ఉన్నప్పటికీ కొందరు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణను పట్టించుకోవడం లేదని, వారి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని… ఇలాంటి ఘటనలను చూస్తూనే ఉన్నామని చెప్పారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు… చనిపోయాక వారి ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్న సందర్భం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ క్రమంలోనే పురాణాలలోని శ్రవణ కుమారుడి కథను సభలో వివరించారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో అందరూ శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే వారి బాగోగుల గురించి ఎలాంటి చట్టాలు, నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉండదన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని… లేదా ఎక్కువ మంది సంతానం ఉండేదని… దాని వల్ల ఒకరు కాకపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రుల సంరక్షణ చూసేవాళ్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కుటుంబ నియంత్రణతో చాలా మంది సంతానం ఒక్కరిద్దరికే పరిమితమైందని చెప్పారు. ‘‘నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ సోకితే చికిత్స ఇప్పించకుండా నిర్లక్ష్యం వహించారు. ఇటీవలే వారు మరణించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలి. ఒక సామాజిక బాధ్యతగా ఈ బిల్లును తీసుకువస్తున్నాం. పిల్లల్లో జవాబుదారితనం రావాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ఏ తల్లి దండ్రులు అనాథలుగా మిగిలిపోవద్దని… చివరి రోజుల్లో వాళ్ల బాగోగుల కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే కాదని… ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలో చేర్చామని తెలిపారు. ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా వృద్ధ తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించినవారిగా మారుతామని తెలిపారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని, ఒక సామాజిక బాధ్యతతో తెసుకొచ్చిన ఈ బిల్లుకు అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాలని సభకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.