అంగన్‌వాడీ వ్యవస్థలో భారీ మార్పులు

పోషణ సఖిల నియామకాలకు గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్ : అంగన్వాడీ వ్యవస్థపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలలో పిల్లలకు పోషకాహారం సరైన సమయంలో అందించడంతోపాటు వారి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పోషణ సఖిలను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ రాష్ట్ర శాసన మండలి హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాస స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించిన పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ దృష్టికి తెచ్చారు.చిన్న వయసులో పోషకాహార లోపం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన వివరించారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సూచించారు. పోషణ సఖి పేరుతో మరోకరి నియామకం అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందించేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్ సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందించేందుకు “పోషణ సఖి” పేరుతో మరొకరిని నియమించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు వివరించారు. కార్తీక్ మురళీధరన్ సూచించిన అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కార్తీక్ మురళీధరన్‌తో సమన్వయం చేసుకుని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అనేక అంశాలను తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *