సాక్షి డిజిటల్ న్యూస్ : యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ట్రంప్ ఇచ్చిన గడువు ముగియనున్న తరుణంలో రెండు రోజుల పాటు బయటకు రావద్దని, ఉన్నచోటే ఉండాలని సూచనలు చేసింది. ఇరాన్‌ను ఈ రాత్రికి పూర్తిగా నాశనం చేస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. హర్మూజ్ జల సంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా అమెరికాలోనే ట్రంప్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌లోని భారతీయులకు అక్కడ భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీచేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు తాము ఉన్నచోటనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ‘‘ఎంబసీ అద్దెకు తీసుకున్న హోటళ్లలో ఉన్నవారు.. అక్కడి రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదిస్తూ ఉండాలి’’ అని అడ్వైజరీలో తెలిపింది. ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయం అప్డేట్లను గమనిస్తూ ఉండాలని అప్రమత్తం చేసింది. అంతేకాదు, అత్యవసర సహాయం కోసం 989128109115, 989128109102, 989128109109, 989932179359 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. హర్మూజ్ జల సంధి తెరవాలని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ వచ్చింది. ఇరాన్ నాగరికతను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాత్రి ఇరాన్ నాగరికత మొత్తం అంతం అవుతుందని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇరాన్లో 47 ఏళ్ల అవినీతి, రాక్షస పాలనకు నేటితో ముగింపు పలుకుతామని, ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటిగా నిలవబోతుందని ఆయన చేసిన ప్రకటన ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని తెగేసి చెప్పింది. అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంభాషణ మార్గాలను ఇరాన్ నిలిపివేసిందని టెహ్రాన్ టైమ్స్ నివేదించింది. ‘‘ఇరాన్ అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంభాషణ మార్గాలను నిలిపివేసింది.. అన్ని రకాల సందేశాల సంప్రదింపులకు కూడా నిలిపివేశారు’’అని ఆ పత్రిక నివేదించింది. వారాల తరబడి సాగిన సంఘర్షణలో అమెరికా- ఇజ్రాయెల్.. ఇరాన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసి, ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని హతమార్చాయి. దేశ మౌలిక సదుపాయాలలోని కొన్నింటిని నాశనం చేశాయి. మంగళవారం రాత్రి 8 గంటల్లోనే హర్మూజ్ జల సంధిని తెరవాలని, లేకుంటే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, చమురు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌లోని ప్రతి వంతెనను కూల్చేస్తామని బెదిరించారు. దీంతో ట్రంప్ తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.