సాక్షి డిజిటల్ న్యూస్ : చైనాకు అమెరికా సాయం చేయడం వల్లే అది ఈరోజు మాకు పోటీగా నిలిచిందని.. ఇదే తప్పు భారత్ విషయంలో తాము చేయమని విదేశాంగ శాఖ ఉప మంత్రి క్రిస్టఫర్ లాన్‌డౌ తెలిపారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ‘భారత్ ఎదుగుదల ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడదు.. మా సొంత శక్తిసామర్థ్యాలతో ఎదుగుతాం’ అని స్పష్టం చేశారు. రైసినా డైలాగ్ వేదికగా జైశంకర్ చేసిన ఈ గర్జన ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతర్జాతీయ దౌత్య వేదికపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తన వాక్చాతుర్యంతో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా శనివారం ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ ప్రగతి పథాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ముఖ్యంగా అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి క్రిస్టఫర్ లాన్‌డౌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జైశంకర్ పదునైన విమర్శలు గుప్పించారు. మీ తప్పులు, దయ వల్ల కాదు.. మా శక్తిసామర్థ్యాలతో ఎదుగుతాం అని ఘాటుగా బదులిచ్చారు. పొరపాటును పునరావృతం కానివ్వమన్న అమెరికా.. రెండు రోజుల క్రితం ఇదే కార్యక్రమంలో క్రిస్టోఫర్ లాన్‌డౌ మాట్లాడుతూ.. “గతంలో అమెరికా చేసిన సహాయం వల్లే చైనా మాకు ప్రధాన పోటీదారుగా ఎదిగింది. భారత్ విషయంలో అలాంటి పొరపాటును పునరావృతం కానివ్వం. భారత్‌కు చైనా తరహా ఆర్థిక ప్రయోజనాలు సమకూరనివ్వం” అని వ్యాఖ్యానించారు. అంటే భారత్ మరో చైనాలా ఎదగకుండా అడ్డుకుంటామనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. జైశంకర్ ధీటైన సమాధానం.. లాన్‌డౌ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందిస్తూ.. “భారత్ వృద్ధి అనేది ఇతరుల తప్పిదాలపై ఆధారపడి లేదు. మా పురోగమనాన్ని మేమే నిర్దేశించుకున్నాం. సవాళ్లు ఎదురైనా మా ప్రయాణం ఆగదు” అని గర్వంగా ప్రకటించారు. తమతో కలిసి పనిచేసే వారు అధిక ప్రయోజనం పొందుతారని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని చాటుకుంటుందని ఆయన వివరించారు. ‘భారత్ ఎదుగుదలను భారతదేశమే నిర్ణయిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచమే భవిష్యత్తు.. ప్రపంచం ఇకపై ఏ ఒక్క దేశం అజమాయిషీలో ఉండదని, అది ‘బహుళ ధ్రువ’ వ్యవస్థగా మారుతుందని జైశంకర్ విశ్లేషించారు. పెద్ద దేశాలే విధివిధానాలు నిర్ణయించే రోజులు పోయాయని, అన్ని దేశాల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. బహుళ ధ్రువ వ్యవస్థ అనేది ప్రపంచ శాంతికి, అభివృద్ధికి కీలకమని ఆయన ఉద్ఘాటించారు.