క్రిమినల్స్‌తో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి

*సీఎం చంద్రబాబు వెల్లడి

జనం న్యూస్ : నా జీవితంలో రాజకీయ పోరాటాలు చేశాను తప్ప… నేరగాళ్లతో ఏనాడూ పోరాడలేదు. ఇది నాకు కొత్తగానే ఉంది. ఎన్నిలయ్యేదాకా వివేకా హత్యను వాడుకున్నారు… అధికారంలోకి వచ్చాక న్యాయం చేయండని సునీతారెడ్డి అడిగితే సైలెంట్‌గా ఉండమని ఆమెను బెదిరించారు’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి. పార్టీ కూడా కార్యకర్తలను అంతే గౌరవిస్తుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులకు వచ్చిన క్లస్టర్ ఇన్‌చార్జిలతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్దాంతాలు… పార్టీ సంస్థాగత బలోపేతం… ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై క్లస్టర్ ఇన్‌చార్జిలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు.ప్రతీ కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని… కేడర్ దాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. క్రిమినల్స్‌తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి క్లస్టర్ ఇన్‌చార్జిలు సమకాలీన రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న అరాచకాలను సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్‌తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు హితబోధ పలికారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలి ‘అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలి. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘2019లో వైసీపీ గెలిచింది… రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కివెళ్లింది. నన్ను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నాను. రాజకీయాలను దాటి… సామాన్య ప్రజల్ని నాటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు రైట్ రాయల్‌గా బతకాలి ‘2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలి.మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతోపాటు… కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు తెలియచేయాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ‘టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి. పార్టీ కూడా కార్యకర్తలను అంతే గౌరవిస్తుంది. కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. కిల్లర్ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలి. రోడ్ల మీదకు వస్తారు… రెచ్చగొడతారు… రప్పా రప్పా అంటారు… ప్రజలను ఇబ్బందులు పెడతారు… చర్యలు తీసుకుంటే రాజకీయమంటారు. అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్తారు… కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారు… కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం పరామర్శించరు. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేశారు. పంపకాల్లో విభేదాలు రావడంతో దస్తగిరి అనే కార్యకర్తను చంపేశారు. వాళ్ల మనుషుల్ని వాళ్లే చంపుకుని నేరం మనపై నెట్టేస్తారు’అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *