సాక్షి డిజిటల్ న్యూస్: సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి – రైతన్నపంట పండాలి అని ఆకాంక్షించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. హెక్టారుకు తగ్గిన సగటు యూరియా వినియోగంపై అభినందించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా. రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని. ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్‌తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు. రాష్ట్రంలో గతేడాది రబీలో హెక్టారుకు యూరియా వినియోగం తగ్గడం శుభపరిణామమని అన్నారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీని కోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా చేసేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా కోకో పంటకు సంబంధించి ‘కోకో సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని. కోకో సిటీ ఔత్సాహిక రైతులకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 250 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31 అరకు ఏజెన్సీలో కుంకుమ పువ్వు సాగును మరింత విస్తరించేలా, మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చేలా అధ్యయనం జరపాలన్నారు. ఏపీ మష్రూమ్ మిషన్ 2026-2031 కింద ఏడాదికి లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతపురంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఆపిల్, పండ్లు రుచికరంగా ఉన్నాయని, వాతావరణం కూడా అనుకూలించిందని అధికారులు చెప్పగా, మరింత విస్తీర్ణంలో సాగు జరిపేలా అక్కడ వాతావరణాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే అవకాడో, అంజీర్, పనస, జామ, మిరియాల సాగును పెంచేలా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. అంజీర్ వంటి పండ్లను డ్రైఫ్రూట్‌గా మార్చి వాటి విలువ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. బీపీఎల్‌కు దిగువున ఉన్న రైతు కుటుంబాలకు అనుబంధంగా డెయిరీ, లైవ్ స్టాక్ ద్వారా అదనపు ఆదాయం పొందేలా సహకారం అందిచాల్సి ఉందని సీఎం అన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి సాయం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.