రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన వేడి తీవ్రత

* శనివారం 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని హెచ్చరిక * 45 డిగ్రీల వేడి.. బయటకు వెళ్లేముందు ఇది తప్పక చదవండి!

* మాడిపోతున్న జనజీవనం.. 45 డిగ్రీల ఎండలతో ప్రజల విలవిల * కరిగిపోతున్న జీవితం.. ఎండలతో ప్రజల నిస్సహాయ పరిస్థితి

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజున అత్యధికంగా మన్యం జిల్లా సాలూరులో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు శనివారం రోజున 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కువ మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటితే ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. శుక్రవారం రోజున అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలోని నగరడోనలో 43.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే మరో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం రోజున ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం తీవ్రవడగాల్పులు వీచే మండలాల జాబితా శ్రీకాకుళం జిల్లా: హిరమండలం, పాతపట్నం మండలాలు పార్వతీపురం మన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం మండలం,పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే అకస్మాత్తుగా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. ఇలాంటి సమయాల్లో పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు.. ప్రజలకు సూచనలు మరోవైపు పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ వస్తువులను ధరించాలని, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంతగా ద్రవపదార్థాలు తీసుకోవాలని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఇళ్లల్లోనే ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బయటకు వెళ్లాల్సి వస్తే టోపీలు, రుమాలు ధరించాలని.. లేకపోతే గొడుగు వెంట తీసుకెళ్లాలని జాగ్రత్తలు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *