రెవిన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి సేవలు ప్రారంభం.. మండల స్థాయికి విస్తరణ త్వరలో

* వెంటనే రెవిన్యూ డివిజన్ స్థాయిలో అమలుకు సీఎం ఆదేశాలు

* ప్రజలకు మరింత చేరువగా ప్రజావాణి సేవలు * త్వరలోనే మండల స్థాయిలోనూ అమలు చేయాలని ఆదేశం

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రజావాణి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలను స్వీకరిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో అర్జీలను స్వీకరిస్తుండగా.. జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వెంటనే ప్రజావాణి సేవలను రెవిన్యూ డివిజన్ స్థాయిలో ప్రారంభించాలని.. త్వరంలోనే మండల స్థాయికి కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, వాటిని వెంటనే పరిష్కరించడం కోసం తెలంగాణలో ‘ ప్రజావాణి ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా భవన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యం లో ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్​ఆర్​డీలో జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతోపాటు సీఎంవో అధికారులను ఈ మేరకు ఆదేశించారు. ప్రజావాణి సేవలను వెంటనే రెవిన్యూ డివిజన్ స్థాయిలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే మండల స్థాయికి కూడా విస్తరించాలన్నారు. దీని వల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రజావాణికి వచ్చే సమస్యల పరిష్కారానికి అన్ని స్థాయిల్లోనూ అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి.. సంబంధిత విభాగాలకు పంపించాలని.. పరిష్కార పురోగతిని అర్జీదారుడికి తెలిపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలన్నారు. ప్రతి స్థాయిలోనూ ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని.. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్నారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో రాజీ పడొద్దని.. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. డ్యాష్‌ బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే అవకాశం ఉండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యుల్ని చేయాలన్నారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడం వల్ల జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కొన్ని అర్జీలను కింది స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *