రాఘవ్ చద్ధా సోషల్ మీడియా ఫాలోవర్లు 12 లక్షలు తగ్గినట్లు సమాచారం

* రాఘవ్ చద్ధా నిర్ణయంపై జెన్ జీ నుంచి తీవ్ర వ్యతిరేకత * 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌ను అన్-ఫాలోచేసిన నెటిజన్లు

ఆప్ నుంచి బీజేపీలోకి ప్లేటు ఫిరాయించిన ఏడుగురు ఎంపీలు

పయనించే సూర్యుడు న్యూస్ : రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీలు ఆప్‌కి రాజీనామా చేసి, తమ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. దీంతో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అధినాయకత్వం పార్టీ సిద్ధాంతాలు, విలువలకు దూరం కావడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఆయన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో జెన్ జీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్‌స్టాలో ఆయనను 24 గంటల్లోనే దాదాపు 12 లక్షల మంది అన్-ఫాలో చేశారు. బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యువ ఎంపీ రాఘవ్ చద్ధాకు మంచి క్రేజ్‌ ఉంది. పార్లమెంట్‌లో సామాన్యుల సమస్యలపై ఆయన సంధించే ప్రశ్నలు, మాట్లాడే విధానం ఎంతగానో ఆకట్టుకుంటాయి. తరుచూ ఆయనపై నెటిజన్లు అభినందిస్తుంటారు. కానీ, ఆయన ఆప్‌ను వీడి బీజేపీలో చేరడం పట్ల అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. చద్ధా పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్‌ మీడియాలో ఆయన ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఫాలోవర్లు 14.6 మిలియన్ల ఉండగా.. శనివారం ఆ సంఖ్య 13.4 మిలియన్లకు పడిపోయింది. అంటే 12 లక్షల మంది యూజర్లు ఆయనను అన్‌ఫాలో చేశారు.రాఘవ్ చద్ధా బీజేపీలో చేరడాన్ని జెన్‌జీ వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎన్సీపీ(ఎస్పీ) అధికార ప్రతినిధి అనీష్ గవాండే స్పందిస్తూ… సోషల్ మీడియా మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోను చేయగలదని, అలాగే జీరోకి కూడా పడేయగలదని పేర్కొన్నారు. రాఘవ్ చద్ధా తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతోనే 12 లక్షల మంది యువత రాఘవ్ చడ్ఢాను అన్‌ఫాలో చేశారని చెప్పారు. వేలాది మంది నెటిజన్లు ఆయన పోస్టుల కామెంట్ సెక్షన్లలో ‘రాఘవ్ చద్దాను అన్‌ఫాలో చేయండి’ ‘హీరో టు జీరో’ వంటి కామెంట్లు పెట్టి.. ‘పంజాబ్ దా గద్దర్’ అని ముద్ర వేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 1 లక్ష సంభాషణలలో ట్రోలింగ్ లేదా ప్రతికూల స్పందనలు ఉండగా.. దాదాపు 5,000 మంది ఫేస్‌బుక్ యూజర్లు విమర్శలు లేదా అన్‌ఫాలో ప్రచారాలలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఆయన గళం విప్పడం, సామాన్యుల పక్షాన వాదించడం వంటి కారణాలతో ఇటీవల రాఘవ్ చద్ధాకు ప్రజాదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. అయితే, ఆయన ఆకస్మిక రాజకీయ నిర్ణయం ప్రజల్లోని ఒక వర్గాన్ని నిరాశకు, అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. రాఘవ్ చద్ధాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండొంతుల మంది బీజేపీలో చేరుతున్నారని చద్ధా వెల్లడించారు. రాజ్యసభలో ఆప్‌కి మొత్తం 10 ఎంపీలు ఉండగా.. ఏడుగురు బీజేపీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ నెలలోనే చద్ధాను ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి, అశోక్ మిట్టల్‌ను ఆ స్థానంలో నియమించింది. ఆయన కూడా బీజేపీలో చేరడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *