పయనించే సూర్యుడు న్యూస్ : అస్సాంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. రూ.24 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. శనివారం అసోంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి పాఠం చెబుతున్నారని అన్నారు. దేశంలో వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలతో కాంగ్రెస్ త్వరలోనే “ఓటముల సెంచరీ” పూర్తి చేసుకునే పరిస్థితికి చేరుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా ఇండియన్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన అర్ధనగ్న నిరసనలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ నాయకులు విచిత్రమైన నిరసనలకు దిగుతున్నారని ప్రధానమంత్రి మోదీ ఆరోపించారు. ఏఐ సమ్మిట్‌ను అప్రతిష్ఠకు గురిచేయాలనే ఉద్దేశంతో బహిరంగంగా తమ బట్టలను తామే చింపుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో, నిరాశలో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఇలాంటి చర్యలే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఇక గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అప్పటి పాలనలో అస్సాం యువతను హింస మరియు ఉగ్రవాదం వంటి సమస్యల వైపు నెట్టారని మోదీ ఆరోపించారు. అలాగే అస్సాంను ‘డివైడ్ అండ్ రూల్’ రాజకీయాలకు ప్రయోగశాలగా కాంగ్రెస్ ఉపయోగించిందని అన్నారు. అసోంలో రూ.24 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దశాబ్దాల పాటు ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి ప్రధాన ప్రవాహం నుంచి దూరంగా ఉంచారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బరాక్ వ్యాలీ(Barak Valley) అభివృద్ధిని కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అస్సాంలో సుమారు రూ.24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుల విలువ ఎంత పెద్దదో కాంగ్రెస్ నాయకులకు అర్థం కాదని, ఒక పెన్ను మరియు కాగితం ఇచ్చి ఈ సంఖ్యను రాయమంటే కూడా సరిగ్గా రాయలేరని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచే బీజేపీ పని ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.