పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ సంస్థగా చెబుతున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వ కాంట్రాక్టులను సక్రమంగా కేటాయించలేదని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్కు ఈ లేఖను పంపిస్తున్నట్టుగా తెలిపారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ కేసులో సేకరించిన కీలక సాక్ష్యాలు అదృశ్యమయ్యాయని ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు తెలియజేయడం అత్యంత దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీ కోసమే అధికారులపైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను, పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, పోలీస్ వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాళా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీపైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసుల పైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని కేంద్రాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారని ఆరోపించారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి అప్పచెబుతున్నారని ఆరోపణలు చేశారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసునని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా సీఎ: రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించిందని అన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే కేఎల్ఎస్ఆర్ కంపెనీ చేస్తున్న నేరాలు, ఆ కంపెనీకి ముఖ్యమంత్రి చేస్తున్న అనుచిత లబ్ది నేపథ్యంలో సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కేటీఆర్ కోరారు.