అక్షర ఆయుధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం నుంచి కాకినాడ పైప్లైన్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. ఈనెల 26వ తేదీకల్లా పంట నష్టంపై నివేదిక ఇవ్వడం అని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాలతో తలెత్తిన పంట నష్టంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పీఎన్జీ విస్తరణ కోసం 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 60 వేల మంది వినియోగదారులు మాత్రమే కనెక్షన్లు పొందారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే దీనిని 100 శాతం వినియోగించుకునేలా చూడటంతో పాటు, జిల్లాకు కనీసం 10 వేలకు తగ్గకుండా నూతన కనెక్షన్లు ఇవ్వాలంటూ సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం – కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని చెప్పారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.ఏపీలో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు వచ్చే కేబినెట్ సమావేశానికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్’ విధానాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గ్యాస్ సంక్షోభం విద్యుత్ రంగానికి ఒక అవకాశమని, ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటివి ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించేలా చూడాలని అన్నారు. విద్యా సంస్థలకు, ఆస్పత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటిన్లు, హోటళ్లకు ప్రాధాన్యతా క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు గత ఐదు రోజులుగా గృహావసరాల కోసం రోజుకు సగటున 1.80 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. అటు అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన పంట నష్టం ప్రాథమిక వివరాలపైనా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ నెల 26వ తేదీ కల్లా పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయంలో జీఎస్డీపీ 40 శాతం, ఉత్పాదన 71 శాతం పెరగడంతో పంటల నిర్వహణ, పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.టెక్నాలజీ వినియోగించడంతో అన్నింటా మంచి ఫలితాలు వస్తున్నాయని… దీనికి తిరుమలలో పెరిగిన దర్శనాల సంఖ్యనే నిదర్శనమని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ సాయంతో తిరుమలలో క్యూలైన్లు, భక్తుల రద్దీ… నిర్వహణ వల్ల నిరీక్షణ సమయం తగ్గిందని, దీంతో 20 శాతం వరకు భక్తులు అదనంగా దర్శనాలు చేసుకునే అవకాశం లభించిందన్నారు. ఇప్పుడు కొండపై ప్రసాదం బావుంది, దర్శనం బావుంది, శ్రీవారి సేవకులు, భక్తుల్లో సంతృప్తి పెరిగిందని అన్నారు. అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా తిరుమల ప్రసాదాల్లో న్యుట్రిషనల్ విలువలు, పదార్ధాల క్వాలిటీ చెక్ చేస్తున్నామని….దీంతో భవిష్యత్లో కల్తీకి ఆస్కారం ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.