మూసీ బాధితులకు సీఎం రేవంత్ హామీ

ఏ ఒక్కరికీ నష్టం జరగదు

అక్షర ఆయుధం ; మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సహాయాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలను క్షుణ్ణంగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు.హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు, 1 లక్షకు పైగా చ.కి.మీ మేర విస్తరించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత గురించి వివరించారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితులను గమనంలోకి తీసుకుని చరిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అసరం, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనా భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసే వారెవరూ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన చేయరని తెలిపారు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం బాబు‌లో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామని తెలిపారు.రాష్ట్రంలోని నగరాలు, పెట్టుబడులు, ప్రజల జీవన స్థితిగతులపై రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎప్పుడు చర్చ జరిగినా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల గురించి ఎక్కువగా చర్చిస్తారని అన్నారు. హైదరాబాద్ అనగానే ప్రధానంగా ఫార్మా రంగంతో పాటు లివబుల్ సిటీగా గుర్తుచేసుకుంటారని అన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అనేక సమస్యలు తలెత్తు తున్నాయని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్న ముంబై వర్షాలొస్తే నివసించలేని పరిస్థితి ఉందని… ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం ఉందని… బెంగళూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ సమస్య ఉందని… భారీ వర్షాలొస్తే చెన్నైలో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఆయా నగరాల్లో ఎదురవుతున్న అనుభవాలను చూసిన తర్వాత మూసీ ప్రక్షాళనతో పాటు నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించామని తెలిపారు. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా విలసిల్లిన చారిత్రాత్మక హైదరాబాద్ ఇప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపారు. అయితే ఆ సమస్యలు భూ భౌగోళిక పరిస్థితుల కారణంగా తలెత్తినవి కావని… మానవ తప్పిదాల కారణంగా తలెత్తిన సమస్యలని పేర్కొన్నారు.కులీకుతుబ్ షాహీల కాలంలో గుల్జార్ హౌజ్, ఫలక్‌నుమా, తారామతి భారాదరి, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు సమావేశాలు నిర్వహించుకుంటున్న శాసనమండలి హాలు.. ఇలా ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన నగరం ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందుల వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణను CURE (క్యూర్), PURE (ప్యూర్), RARE (రేర్) మూడు ప్రాంతాలుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. 1.34 కోట్ల జనాభా కలిగిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని కోర్ అర్భన్ రీజియన్‌గా గుర్తించి కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్‌లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించామని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలోనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి వైపునకు తరలించి… ఇక్కడి పారిశ్రామిక జోన్‌లో ఉన్న భూములను మల్టీయూజ్ జోన్‌లోకి మార్చుతున్నామే, తప్ప యాజమాన్యపు హక్కులు మారవని స్పష్టం చేశారు. మల్టీయూజ్ జోన్‌లోకి మార్చడం వల్ల మధ్య తరగతి నివాస ప్రాంతాలుగా మారుతాయని చెప్పారు.ఇక, 20 టీఎంసీ గోదావరి నీటని తరలించి అందులో 17 టీఎంసీ జంటనగరాల తాగునీటి కోసం, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం నీరు ప్రవహించేలా వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం సమగ్రమైన ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నామని తెలిపారు.మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయమని… వారికి మరిన్ని మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, ఏ ఒక్కరికి నష్టం చేయమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *