అక్షర ఆయుధం క్యూబా దేశానికి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో, సోమవారం దేశవ్యాప్తంగా విద్యుత్ కోతను ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ‘క్యూబాను స్వాధీనం చేసుకుంటాం’ అని హెచ్చరించిన నేపథ్యంలో నిరసనలు చెలరేగాయి. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని కొనసాగిస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా క్యూబాను స్వాధీనం చేసుకోవడంపై దృష్టిసారించంది. క్యూబా ద్వీప దేశాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని తెలిపారు. క్యూబాలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా విధించిన చమురు దిగ్బంధనంతో క్యూబా దేశానికి ఇంధన సరఫరాను నిలిపివేయడంతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. సోమవారం, విద్యుత్ గ్రిడ్ కుప్పకూలడంతో క్యూబాలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ద్వీపంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచారు. “క్యూబాను స్వాధీనం చేసుకునే గౌరవం నాకు దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. క్యూబాను ఏదో ఒక రూపంలో స్వాధీనం చేసుకోవడం, నేను దానికి స్వేచ్ఛను ఇచ్చినా, దాన్ని స్వాధీనం చేసుకున్నా, నేను కోరుకున్నది ఏదైనా చేయగలను,” అని ఆయన తెలిపారు.సుమారు 11 మిలియన్ల జనాభా ఉన్న క్యూబా చాలా కాలంగా విద్యుత్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కోంటోంది. హవానాకు కీలక సరఫరాదారు అయిన వెనిజులా నుండి వాషింగ్టన్ చమురు రవాణాను నిలిపివేసిన తర్వాత, ఇటీవలి కాలంలో క్యూబాలో పరిస్థితి తీవ్రంగా దిగజారింది. క్యూబా దేశానికి ఇంధనాన్ని పంపించవద్దని అమెరికా ఇతర దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఒత్తిడి ప్రభావం చూపు తున్నట్లు కనిపిస్తోంది. తమ దేశానికి మూడు నెలలుగా ఇంధనం అందడం లేదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ గత వారం తెలిపారు. గ్రిడ్ కుప్పకూలినప్పటికీ, పనిచేస్తున్న విద్యుత్ యూనిట్లలో వైఫల్యాలు సంభవించినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లేవని స్థానిక అధికారులు తెలిపారు. కాబట్టి, విద్యుత్ సరఫరాలో ఈ అంతరాయం సాంకేతిక లోపాల వల్ల కాకుండా సరఫరాలో లిమిట్స్ వల్లే సంభవించిందని తెలుస్తోంది.విద్యుత్ సరఫరాలో అంతరాయంతో నిరసనలు !విద్యుత్ కోతలు పెరిగిపోతున్న నేపథ్యంలో క్యూబా అంతటా నిరసనలకు దారితీశాయి. దీంతో వారం రోజులకు పైగా నిరసనలు జరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మధ్య నగరమైన మోరోన్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాల దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.