జూన్ 1 నుంచి దక్షిణకోస్తా రైల్వే జోన్ ప్రారంభం!

*ఉత్తరాంధ్రకు భారీ ఊరట…

జనం న్యూస్ : ఏపీలోని పోర్టులను అనుసంధానించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులు, ప్రతిపాదిత నూతన మార్గాలు, పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్ రీఫర్ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖను కోరారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. అనంతరం రైల్వే మంత్రితో కలిసి దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి, రైల్వే మంత్రితో కలిసి చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి, కార్యకలాపాలు సహా, ఏపీ లోని రైల్వే ప్రాజెక్టుల పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం 2026 జూన్ 1 తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం శుభ పరిణామం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నూతనంగా ఏర్పాటు అవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో మరికొన్ని రైల్వే సెక్షన్లు విలీనం చేస్తూ కొన్ని పాలనా పరమైన మార్పులు చేయాలని సీఎం కోరారు. ఏపీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు – కొత్తవలస సెక్షన్, కర్నూలు – డోన్‌లను కొత్త జోన్‌లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. రైల్ రూట్ డెన్సిటీ లేని కారణంగా ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఇబ్బంది కలుగుతున్నట్టు వివరించారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గాలను వేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న పోర్టులు సహా కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు కనెక్టివిటినీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. చత్తీస్ ఘడ్, ఒడిశా, తెలంగాణా, మహారాష్ట్రలోని నాగ్ పూర్, మధ్య ప్రదేశ్ లోని ఇటార్సీ, కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి ఈ పోర్టులకు కార్గో రవాణా చేసేలా హింటర్ ల్యాండ్ ను రైల్వే ద్వారా అనుసంధానించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీలోని పోర్టులను అనుసంధానించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులు, ప్రతిపాదిత నూతన మార్గాలు, పనుల గురించి ముఖ్యమంత్రికి ఆయన స్వయంగా వివరించారు. ఈ సమీక్షకు మంత్రి డీబీవీ స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణ బాబు, విష్ణు కుమార్ రాజు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఏపీ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *