రాఘవ్ చద్దా బీజేపీ చేరికపై ఊహాగానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ

ఢిల్లీ రాజకీయాల్లో తాజా పరిణామాలు.. ఆప్-బీజేపీ సమీకరణలపై దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి, ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి, ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరుతున్నారు. వారిలో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ముగ్గురు సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. అయితే తాము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని… నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని భావిస్తున్నామని తెలిపారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీని వీడుతున్నానని, బీజేపీలో చేరుతున్నానని రాఘవ్ చద్దా తెలిపారు. మరికొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా పార్టీని వీడతారని పేర్కొన్నారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ… ‘‘రాజ్యసభలో ఆప్‌కు చెందిన మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మందిమి అయిన మేము…. భారత రాజ్యాంగ నిబంధనలను వినియోగించుకుంటూ బీజేపీలోలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము’’ అని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రాతినిథ్యం రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించామని రాఘవ్ చద్దా చెప్పారు. మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది ఆప్ ఎంపీలు దీనిపై సంతకాలు కూడా చేశారని చెప్పారు. ‘‘రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ప్రయత్నంలో (రాజ్యసభలో బీజేపీలో ఆప్ విలీనం) పది మందిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది మాకు మద్దతుగా నిలిచారు. వారు ఇప్పటికే సంతకాలు చేశారు. ఈ ఉదయం, సంతకాలు చేసిన లేఖలు, ఇతర అధికారిక పత్రాలతో సహా అవసరమైన డాక్యుమెంటేషన్ మొత్తాన్ని మేము రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించాము. మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఎంపీలు మాకు మద్దతు ఇస్తున్నారు. ఆ పూర్తి జాబితాను మేము త్వరలోనే మీకు అందిస్తాము. వారిలో ముగ్గురం ఇక్కడ మీ ముందు ఉన్నాం. వీరితో పాటు ప్రపంచ స్థాయి క్రికెటర్ హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్ కూడా ఉన్నారు’’ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. అలాగే, తాను ఆప్‌కు దూరంగా ఉండటానికి గల కారణాన్ని వివరించారు. ‘‘నేను పార్టీ కార్యకలాపాలకు ఎందుకు దూరమయ్యానో ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. వారి (ఆప్ నేతల) నేరాల్లో భాగస్వామిగా ఉండటం నాకు ఇష్టం లేదు. వారి నేరాల్లో నేను భాగం కాలేదు కాబట్టి… వారు నాతో స్నేహం కొనసాగించలేదు. మా ముందు కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి… ఒకటి రాజకీయాల నుంచి తప్పుకుని, గత 15-16 ఏళ్లుగా మేము చేస్తున్న ప్రజా సేవను వదులుకోవడం; లేదా మా శక్తి, అనుభవంతో సానుకూల రాజకీయాలను కొనసాగించడం. అందుకే రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులమైన మేము, భారత రాజ్యాంగ నిబంధనలను వినియోగించుకుని బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము’’ అని రాఘవ్ చద్దా తెలిపారు. రాఘవ్ చద్దా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్‌లు 2022 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా సేవలందిస్తున్నారు. ఇక, రాజ్యసభలో ఆప్‌కు 10 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో మూడింట రెండొంతుల మంది అంటే ఏడుగురు సభ్యులు అని అర్థం. అంటే తనతో సహా కనీసం ఏడుగురు ఎంపీలు ఆప్‌కు గుడ్ బై చెప్పబోతున్నారని రాఘవ్ చద్దా చెబుతున్నారు. అందులో హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్‌లు కూడా ఉన్నారని చెప్పారు. ఇక, ఇటీవల రాఘవ్ చద్దాను పార్టీ వ్యవహారాలకు ఆప్ దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *