తెలంగాణ విద్యార్థినిలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.

త్వరలో ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు!

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలోని విద్యార్థినిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు త్వరలోనే ఈ ఉచిత స్కూటీల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకంకు సంబంధించి విధివిధానాలపై అధ్యయనం చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని సీఎం చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. విద్యార్థినిలకు ఉచిత స్కూటీలు మరోవైపు మహిళా సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు త్వరలోనే ఈ ఉచిత స్కూటీల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు, గృహలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇవ్వడం ద్వారా వారి విద్యకు, స్వావలంబనకూ మరింత తోడ్పాటు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కాపాడుకోవాలి హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.‘దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి. వర్షాలొస్తే ముంబయ్ అతలాకుతలమవుతోంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, వరదలొచ్చినప్పుడు చెన్నై ప్రమాదకర పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం సమీప భవిష్యత్తులో హైదరాబాద్ నివాసయోగ్యం కాని నగరంగా మారే పరిస్థితులు రావొద్దు. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్‌ నగరానికి తలెత్తకూడదనే ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్‌లో వాయు నాణ్యత(AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దు’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ‘దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం మేరకు దోహదపడుతున్న నేపథ్యంలో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించాం. 2047 నాటికి దేశ జీడీపీలో పది శాతం తెలంగాణ నుంచి దోహదపడాలి. ఈ లక్ష్యసాధనలో మహిళలు సంపూర్ణంగా సహకరించాలి’అని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే చోట మహిళలకు రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం. రక్షణ కల్పించడమే కాకుండా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన కారణంగానే కొన్ని దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా నిలబడ్డాయి. సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలంటే మహిళల శక్తిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలి. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదు. కష్టపడే వారికి గుర్తింపునివ్వాల్సిన బాధ్యత అందరిపైనా ప్రభుత్వాలపైనా ఉంది. దేశంలో అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలన్న లక్ష్య సాధనలో మహిళా జర్నలిస్టుల సహకారం ఉండాలి. మహిళలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చుకుందాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *