హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం కుటుంబానికి కట్టబెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ జనవరి 29న నిర్వహించిన సమావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. నగరం మధ్యలో ఉన్న విలువైన స్థలాన్ని బదలాయించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ కమిటీ ఎన్ఓసీ (NOC) జారీ చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.హైదర్‌గూడ ప్రాంతంలోని ప్రముఖ కేఫ్ బహార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి అధికారులు తీర్మానం (Resolution No. 253) చేశారు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య డాక్టర్ మల్లు రాజా బన్సీదేవి పేరిట ఈ స్థలాన్ని కేటాయించడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. దాదాపు 233.73 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 సెప్టెంబరులో రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ స్థలాన్ని అప్పగించాలని ప్రతిపాదించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కమిటీ సభ్యులు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఒకవైపు సామాన్య ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్న తరుణంలో, మరోవైపు అధికార పార్టీ ఎంపీ భార్యకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వదినకు ఇంతటి భారీ విలువైన భూమిని ధారాదత్తం చేయడం విమర్శలకు తావిస్తోంది.