అక్షర ఆయుధం ; మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు పంపించారు. అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై నిరాధర ఆరోపణలు చేశారని ఈ నోటీసుల్లో సీతక్క పేర్కొన్నారు. తనపై బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. 48 గంటల్లో తనపై చేసిన పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేసి చట్టపరంగా ముందుకు సాగుతానని హెచ్చరించారు. వివరాలు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మంత్రి సీతక్క అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో కూడా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. మంత్రి సీతక్క నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ఫోన్ సదుపాయం కల్పించడానికి 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారని… శాంసంగ్ గెలాక్సీ ఏ06 (4/64జీబీ) ఫోన్ల సరఫరాకు గాను ఓ కంపెనీ రూ. 54,19,41,690కి కాంట్రాక్టు దక్కించుకుందని అన్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ఫోన్లను కొనుగోలు చేస్తూ… ప్రజాధనాన్ని దండుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాసొమ్మును దోచుకోవాలని విడుదల చేసిన ఈ టెండర్లను తక్షణమే రద్దు చేసి, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పలువురు బీఆర్ఎస్ మద్దతుదారులు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు ప్రక్రియలో మంత్రి సీతక్క అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో కూడా ఈ మేరకు పోస్టు కనిపించింది. ‘‘కాంగ్రెస్ అవినీతికి కాదేది అనర్హం!… ఆఖరికి అంగన్వాడి వర్కర్లకు ఇచ్చే ఫోన్లను సైతం వదలని మంత్రి సీతక్క…అంగన్వాడిలకు ఇచ్చిన శాంసంగ్ A06 ఫోన్ ఖరీదు కేవలం రూ. 8,499.. కానీ ఒక్క ఫోను ఖరీదు రూ.14,499 చూపించి, ఏకంగా రూ.30 కోట్ల అవినీతికి పాల్పడ్డ సీతక్క’’ అని బీఆర్ఎస్ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. ఈ ఆరోపణలను మంత్రి సీతక్క ఇదివరకే ఖండించారు. తనపై కొంతమంది పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెల్ ఫోన్ల కొనుగోలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ లైన్ టెండర్లు పిలిచిందని, ఎక్కడా అవినీతి జరగలేదన్నారు.