అక్షర ఆయుధం : భారత ప్రభుత్వం… ఇరాన్‌లోని తమ పౌరుల కోసం తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ నుంచి వీలైనంత త్వరగా విడిచి రావాలని కోరింది. ఇరాన్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ఇరాన్ నాగరికత మొత్తం అంతరించిపోయేలా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయగా… ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టుగా ఆయన ప్రకటించారు. మరోవైపు కొన్నిచోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం… ఇరాన్‌లోని తమ పౌరుల కోసం తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ నుంచి వీలైనంత త్వరగా విడిచి రావాలని కోరింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఒక పోస్టు చేసింది. తాము సూచించిన మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని భారత పౌరులను కోరింది. రాయబార కార్యాలయంతో ముందుగా సంప్రదించి, సమన్వయం చేసుకోకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దును సమీపించడానికి ప్రయత్నించరాదని మరోసారి పునరుద్ఘాటించచింది. భారత రాయబార కార్యాలయం తమ అత్యవసర సంప్రదింపు నంబర్లను కూడా జారీ చేసింది. ఫోన్ నంబర్లు… +989128109115; +989128109109; +989128109102; +989932179359, ఈమెయిల్ ఐడీ – cons.tehran@mea.gov.in. అంతకుముందు అడ్వైజరీలో భారత రాయబార కార్యాలయం… ఇరాన్‌లోని తమ పౌరులు రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండాలని, ఎలాంటి కదలికలకు దూరంగా ఉండాలని కోరింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పులకు విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడినప్పటికీ… ఉద్రిక్తతలు అధికంగా ఉన్న తరుణంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఏప్రిల్ 8వ తేదీన ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌లోని భారత పౌరులు ఇళ్లలోనే ఉండాలని కోరింది. సైనిక మరియు విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. బహుళ అంతస్తుల భవనాలలోని పై అంతస్తులకు వెళ్లవద్దని కోరింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. ముఖ్యంగా హైవేలపై, సరిహద్దుల వైపు ప్రయాణాలు చేస్తే భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని కూడా సూచించింది. భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా కూడా తెలిపింది. భారత పౌరులు తదుపరి సమాచారాన్ని నిశితంగా గమనిస్తూ, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కోరింది. ఇక, ఇరాన్, అమెరికాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అలాగే, ఇరాన్‌పై తాము ప్లాన్ చేసిన దాడులను నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ చర్యను కాల్పుల విరమణ దిశగా జరుగుతున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.