పయనించే సూర్యుడు న్యూస్ : ఇరాన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ భారతీయులకు దేశ భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న మన భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్లో ఉన్న భారతీయులు రాబోయే 48 గంటల పాటు ఎక్కడివారక్కడే సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ స్పష్టం చేసింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సైనిక స్థావరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించిట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. అంతేకాకుండా ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల్లో పై అంతస్తుల్లో ఎవరూ ఉండొద్దని సూచించింది. అత్యవసరమై జాతీయ రహదారులపై ప్రయాణించాల్సి వస్తే కచ్చితంగా ముందుగా రాయబార కార్యాలయం అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరింది. ఫిబ్రవరి చివర నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గడువు ముగుస్తున్నందున రాబోయే కొద్ది గంటల్లో ఏ క్షణమైనా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు జరిగే తీవ్ర ప్రమాదం ఉందని తాజా పరిస్థితిని బట్టి స్పష్టమవుతోంది. గల్ఫ్, పశ్చిమాసియాలో నెలకున్న ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్షిస్తోంది. ఇరాన్ నుంచి ఇప్పటివరకు 1,862 మంది భారతీయులను ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల మీదుగా సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 935 మంది విద్యార్థులతో పాటు 472 మంది మత్స్యకారులు ఉన్నారు. ఫిబ్రవరి చివరలో దాడులు మొదలైనప్పటి నుంచి పశ్చిమాసియా ప్రాంతం నుంచి సుమారు ఆరున్నర లక్షల మంది ప్రయాణికులు సురక్షితంగా భారత్ చేరుకున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారీ సంఖ్యలోని భారతీయుల భద్రత, సంక్షేమానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. పౌరులకు సహాయం అందించేందుకు ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చే వారి వివరాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకుంటూ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అక్కడి రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా భద్రతా సూచనలు జారీ చేస్తున్నట్లు అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ మీడియాకు వివరించారు.