సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి టెక్ విప్లవానికి వేదిక కాబోతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి టెక్ విప్లవానికి వేదిక కాబోతుంది. అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’కి సీఎం చంద్రబాబు ఇప్పటికే శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని దేశ చరిత్రలో కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్‌లో రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో సాంకేతిక శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుందని ప్రభుత్వం చెబుతోంది. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన వన్ ఎస్ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌ను ప్రత్యక్షంగా, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటుచేసిన వన్ క్యూ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌ను వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి దక్కనుంది. మేధాటవర్స్ క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతోపాటు పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు.
అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ క్యూబిటెక్ సంస్థ 1క్యూ పేరిట క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌ను నిర్మించింది. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్‌డీఓలాంటి సంస్థలు సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీలనుంచి వర్చువల్‌గా దాదాపు 1.5 లక్షలమందికిపైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక, ఉద్దండరాయుని పాలెం దగ్గర అమరావతి క్వాంటమ్ వ్యాలీ 50 ఎకరాల్లో ఏర్పాటవుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో ఇక్కడ పరిశోధనలు సాగనున్నాయి.