మహిళలు, నిరుద్యోగులకు రూ.3 వేలు

*బెంగాల్‌లో బీజేపీ భారీ హామీలు

జనం న్యూస్ : పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అక్కడ వరుసగా నాలుగోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ.. బెంగాల్‌ కోటలో తొలిసారి కాషాయ జెండాను ఎగురువేయాలని బీజేపీ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో మహిళలు, యువత, రైతులే టార్గెట్‌గా కమలనాథులు.. మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే, బీజేపీ తన మేనిఫెస్టోను మొత్తం ఉచితాలనే నింపేయడం చెప్పుకోదగ్గ పరిణామం. ఉచితాలను వ్యతిరేకించే బీజేపీ.. బెంగాల్‌లో వాటికే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. పశ్చిమ్ బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కృతనిశ్చియంతో ఉన్న బీజేపీ .. ఏ అవకాశాన్ని వదులుకోరాదని భావిస్తోంది. ఇందులో భాగంగానే మహిళలు, రైతులు, యువతే లక్ష్యంగా ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఉచితాలకు తాము వ్యతిరేకమని చెప్పుకునే కమలనాథులు.. బెంగాల్‌లో మాత్రం అందుకు భిన్నంగా హామీలను గుప్పించడం గమనార్హం. బీజేపీ కూడా ఉచిత పథకాలనే నమ్ముకున్నట్టు మేనిఫెస్టో హామీలను చూస్తే అర్థమవుతుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం బీజేపీ ‘సంకల్ప పత్రం’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. పశ్చిమ్ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 రెండు దశల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు, మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. ‘బంగారు బెంగాల్’ నిర్మాణానికి ఈ మేనిఫెస్టోను రోడ్‌మ్యాప్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)‌పై ఈ సందర్భంగా అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల టీఎంసీ పాలన బెంగాలీలకు ఓ పీడకలను మిగిల్చిందని దుయ్యబట్టారు. ఇక, బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో 90 లక్షల ఓట్లను తొలగించడం గమనార్హం. బీజేపీ సంకల్ప పత్రం రైతులు, యువత, మహిళలకు మార్గనిర్దేశం చేస్తూ వారికి కొత్త దిశను చూపిస్తుంది. బెంగాల్ సంస్కృతి పట్ల గర్వపడే ప్రతి పౌరుడికి ఇది నూతన ఆశను అందిస్తుంది.. సోనార్ బంగ్లా సృష్టికి ఒక రోడ్‌‌‌మ్యాప్‌గా పనిచేస్తుంది’’ అని షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ నమూనాని బెంగాల్‌కు బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పూర్తి జవాబుదారీతనంతో అమలు జరిగేలా చూస్తుందని ఆయన అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంభనను బలోపేతం చేసేలా వారికి నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే, మహిళలకు ఆర్థిక సాధికారికత కల్పించేందుకు 75 లక్షల ‘లక్‌పతి దీదీల’ను సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి మండలంలో కనీసం ఒక మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక సహాయ కేంద్రం కూడా ఉంటుందని షా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *