సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాలో ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడా వేదికలలో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాలో ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడా వేదికలలో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని తెలిపారు. క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ఇందుకు అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్ ఉపాసన కొణిదెల, సభ్యులు కావ్య మారన్, శశిధర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియాన్ని అభివృద్ది చేయడానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఆ స్టేడియంలో హెలీప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నాని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా క్రీడల దీర్ఘకాలిక అభివృద్ధిని సాధించడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి విషయంలో స్పోర్ట్స్ హబ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. ఒలింపిక్ క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి’’ అని సీఎం రేవంత రెడ్డి సూచించారు. ఇదిలాఉంటే, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 74వ బోలానాథ్ ముల్లిక్ స్మారక ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2026 ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితులకు నెట్టివేయబడుతుందని చెప్పారు. ‘‘యువత నెమ్మదిగా క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారు. దేశం కోసం ఏమైనా చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. యువత సరైన దశలో వెళ్లకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. క్రీడాకారులను తయారు చేసి దేశ ప్రతిష్టను నిలబెట్టాలి. యువతను క్రీడల్లో ప్రోత్సహించండి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి విశేష పేరు ప్రఖ్యాతులున్నాయని… 1950-60 దశకంలో నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్‌గా హైదరాబాద్ పేరు గడించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 1956 ఒలంపిక్స్‌లో ఆడిన ఫుట్‌బాల్ జట్టులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్‌కు చెందిన వారేనని తెలిపారు. ఆ క్రమంలో ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ క్రీడల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన పోలీసు విభాగానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్టుగా చెప్పారు.