బాసర అమ్మవారి ఆలయానికి మహా పునరుద్ధానం-సీఎం హామీ నెరవేర్చే దిశగా అడుగు

* బాసర ఆలయానికి రూ.225 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (శనివారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండగా.. ఏప్రిల్ 6వ తేదీన (సోమవారం రోజున) ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది.. సుదర్శన్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను సుదర్శన్ రెడ్డి శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనకు సంబంధించిన ప్రాంతాలను సందర్శించి, అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలు ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో హెలిప్యాడ్, ఆలయం, పరిసర ప్రాంతాల పారిశుధ్యం, పూల అలంకరణ, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను సాఫీగా నిర్వహించాలని తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *