వేసవి కాలంలో ఖాళీ ఇళ్ల భద్రతపై పోలీసుల సూచనలు

* ఖాళీ ఇళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు-ప్రజలకు పోలీసుల సూచనలు

పయనించే సూర్యుడు న్యూస్ : వేసవి కాలం దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. వేసవికాలం నేపథ్యంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం (ఎల్.హెచ్.ఎం.ఎస్) సేవలను వినియోగించు కోవాలని కోరారు. అలాగే ఎల్.హెచ్.ఎం.ఎస్.యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడు చేసుకోవాలని సూచించారు. మరోవైపు దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసుశాఖ నైట్ పెట్రోలింగును, గస్తీని ముమ్మరం చేస్తున్నప్పటికి, ప్రజలు కూడా దొంగతనాల నియంత్రణకు తమవంతు బాధ్యతగా కొన్ని జాగ్రత్తలను పాటించాలని కోరారు. వేసవి కాలంలో జిల్లాలో దొంగతనాలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. వేసవి కాలంలో చాలా మంది కుటుంబ సమేతంగా ప్రజలు స్వగ్రామాలకు, పర్యటనలకు వెళ్ళడం, ఇళ్ళను ఖాళీగా వదిలి ఇతర ప్రాంతాలకు వెల్లడం, ఆరుబయట నిద్రించడం వలన దొంగతనాలు, చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కావున, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, మున్సిపల్ ప్రాంతాల్లో అనగా విజయనగరం 1వ, 2వ పట్టణ, రూరల్, నెల్లిమర్ల, రాజాం, బొబ్బిలి ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం (ఎల్.హెచ్.ఎం.ఎస్) సేవలను వినియోగించు కోవాలన్నారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం వలన గస్తీ, పెట్రోలింగు సమయాల్లో ఆయా ఇళ్ళపై ప్రత్యేకంగా నిఘా పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఎల్.హెచ్.ఎం.ఎస్.యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడు చేసుకొని, పోలీసుశాఖకు రిక్వెస్ట్ పంపినట్లయితే స్థానిక పోలీసులు ఆయా ఇండ్ల పరిసరాల్లో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆయా ఇండ్లను నిరంతరం గమనిస్తూ, పర్యవేక్షిస్తుంటారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. పిల్లలపట్ల తస్మాత్ జాగ్రత్త అదే విధంగా పరీక్షలు పూర్తయి వేసవి సెలవులు కారణంగా ఇంటి వద్దనే ఉంటున్న తమ పిల్లలను ఒక కంట కనిపెడుతుండాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఈతల కోసం చెరువులు, నదులు, నూతుల్లో దిగకుండా చూడాలని, నిపుణుల పర్యవేక్షణలోనే ఈత నేర్చుకొనే శిక్షణ పొందాలన్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు, వారిలో క్రీడా ప్రతిభను, డ్రాయింగ్, సింగింగు, డాన్స్ వంటి సృజనతాత్మకమైన కళలను, నైపుణ్యాలను వెలికితీసే విధంగా చర్యలు చేపట్టాల న్నారు. పిల్లలు చెడు స్నేహాలకు, వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా వారి ప్రవర్తనను గమనిస్తుండాలని, వారిపై ప్రేమ కనబరుస్తూనే వారు ఎక్కడకు వెళ్ళింది, ఎవరితో స్నేహం చేస్తున్నది, వారు ఏమి చేస్తున్నది గమనించాలని తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ ఎ.అర్.దామోదర్ సూచించారు. పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నాం వేసవి కాలంలో దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసుశాఖ నైట్ పెట్రోలింగును, గస్తీని ముమ్మరం చేస్తున్నప్పటికి, ప్రజలు కూడా దొంగతనాల నియంత్రణకు తమవంతు బాధ్యతగా కొన్ని జాగ్రత్తలను పాటించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ దొంగతనాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతూ జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కొన్ని సూచనలు చేసారు. కొన్ని ముఖ్యమైన సూచనలు 1. ఇంటిపై నిఘా పెట్టుకొనేందుకు ఇంటి పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. 2. ఇంటిలోకి ఇతరులు ప్రవేసించకుండా తలుపులను, కిటికీలను వేయాలని, బలమైన గడియలను, తాళాలను వేయాలన్నారు. ఇండ్లను తరుచూ గమనించే విధంగా నమ్మకమైన వ్యక్తులకు సమాచారం అందించాలన్నారు. 3. రాత్రి సమయాల్లో ఇంటి ఆవరణంలో లైట్లు వెలిగేలా చూడాలన్నారు. 4. ఇంటి పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నట్లయితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100/112కు సమాచారం అందించాలన్నారు. 5. విలువైన వస్తువులను, ఆభరణాలను ఇంటిలో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం ఉత్తమమన్నారు. 6. బయట ప్రాంతాలకు వెళ్ళుతున్న విషయాలను సోషల్ మీడియాలోను, వాట్సాప్ స్టేటస్ ల్లో పెట్టవద్దని ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *