సాక్షి డిజిటల్ న్యూస్‘ : ప్రపంచం అంతా ఒకవైపు మాట్లాడితే… ఒక పార్టీ, వ్యక్తి మాత్రం వేరే విధంగా మాట్లాడుతున్నారు. అమరావతి అని పలకటం కూడా వారికి ఇష్టం లేదు. అందుకే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామికి ఘోర అపచారం చేసి సమర్ధించుకున్న వాళ్ల ప్రవర్తనను ఇంకేం ఊహిస్తాం. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అంతా కలిసి నిర్ణయిస్తే.. మళ్లీ ఆ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తారా…? అలాంటి అవకాశమే లేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై మద్దతు పలికితే ఒక్క వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించి వాకౌట్ చేశారని వ్యాఖ్యానించారు.శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం, రాజధాని ఏర్పాటు, అమరావతి ఎంపిక, వైసీపీ కుట్రలు, రాజధాని రైతుల ఉద్యమం, అసెంబ్లీ, మండలిలో జరిగిన పరిణామాలు, న్యాయ పోరాటం, రాజధాని పునర్నిర్మాణం వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…ఒక్క పార్టీ మినహా దేశంలోని పార్టీలన్నీ రాజధానికి అండగా నిలిచాయి. లోక్ సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తూ 50 పార్టీలు ఉంటే వాటిల్లో వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తి స్థాయి చట్టబద్దత వస్తుంది. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పార్లమెంటులో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కృతజ్ఞతలు. రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలున్నా అన్ని పార్టీలు సహకారం ఇచ్చాయి. కొందరికి రాష్ట్రం గురించి తెలియదు.. ఈ రాష్ట్రంతో అవసరం కూడా ఉండకపోవచ్చు…కానీ అలాంటి పార్టీలు కూడా రాజధాని చట్ట బద్దత కల్పించే బిల్లుకు సహకరించాయి. అనుకూలంగా ఓటేశాయి. కానీ ఈ రాష్ట్రంలో ఓట్లు పొంది, ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు ఈ రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించారు. దేశంలోని పార్టీలన్నీ ఓవైపు ఉంటే… వైసీపీ మాత్రం మరోవైపు నిలిచింది. వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు సహకరిస్తాయి. కానీ రాష్ట్రం నాశనమైనా పర్వాలేదనే రీతిలో జగన్ సూచనల మేరకు వైసీపీ ఎంపీలు వ్యవహరించారు. అమరావతి నాశనమై పోయినా పర్వాలేదనుకున్నారు. కానీ మనం దానిపై శాసనం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ రాజ ముద్రతో 5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాయి. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరు.”అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఇటుకా పేర్చుకుంటూ వచ్చాం ‘విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ భావోద్వేగాలు ఉన్నాయి. చాలా అంశాలకు పరిష్కారం చూపకుండానే విభజన జరిగింది. ఆర్ధిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు అన్నీ ఇబ్బందులే’. అప్పాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే పోలవరం 7 ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను. రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం.