టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

కార్యకర్తలకు చంద్రబాబు లోకేష్ ప్రత్యేక విందు

అక్షర ఆయుధం : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని ఎగిరెగిరి పడిన వాళ్లే, ఫినిష్ అయిపోయారని అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన కృషి, త్యాగాలు మరువలేనివని చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి అనేక రికార్డులు నెలకొల్పామని తెలిపారు. సామాన్యులను చట్టసభలకు పంపించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా టీడీపీ సీనియర్ కార్యకర్తలకు తమ నివాసంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తుందన్న కార్యకర్తలను విందుకు ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఇవ్వడమే కాకుండా… వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల గురించి కూడా చంద్రబాబు, లోకేష్‌లు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలు అందజేయడంతో పాటుగా శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మర్చిపోలేమని అన్నారు. ఇక, తమను కుటుంబ సభ్యులుగా భావించి చంద్రబాబు, లోకేష్‌లు ఇంటికి ఆహ్వానించి విందు ఇవ్వడం జీవితంలో మర్చిపోలేమన్న ఈ విందుకు హాజరైన కార్యకర్తలు పేర్కొన్నారు. ఇక, టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.ఇక, లోకేష్ ఎక్స్‌లో చేసిన పోస్టులో తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *