ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమం

తలసేమియా బాధితులకు మే 10న రన్

జనం న్యూస్:ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తుంది అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నాలుగోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ట్రస్ట్ నిర్వహణలో దాతలు, సిబ్బంది సహకారం మరువలేనిది అని కొనియాడారు. త్వరలో విజయవాడ , అనంతపురంలో తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలతో సమావేశమయ్యారు. 4వ రోజు పర్యటనలో ముందుగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుప్పంలో కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాల్య స్నేహితుడు చంద్రశేఖర్ ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బాల కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పేదలకు అండగా ట్రస్ట్ సేవలు ఎన్టీఆర్ స్పూర్తితో, సీఎం చంద్రబాబు సహకారంతో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయింది. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ట్రస్ట్ బాధ్యతలు నాకు అప్పగించారు. చంద్రబాబు అందించిన స్పూర్తితో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా వంతు సాయం అందిస్తున్నాం. దాతలు కూడా మాకు సాయంగా నిలుస్తున్నారు. త్వరలోనే విజయవాడ , అనంతపురంలో కూడా తలసేమియా సెంటర్లు ప్రారంభిస్తాం. ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో నాలుగు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తున్నాం. త్వరలో విజయవాడలో ప్రారంభిస్తాం. తలసేమియా బాధితుల కోసం మే 10న హైదరాబాద్ లో నిర్వహించే రన్ లో అందరూ పాల్గొని వారికి ధైర్యం చెప్పాలని భువనేశ్వరి కోరారు. ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి కల్పన. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపుల నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా 23 లక్షలమందికి సేవలు అందించాం. ఇందుకోసం రూ.23 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *