RSS, RAW పై నిషేధ సూచన

అమెరికాకు భారత్ కఠిన సమాధానం

సాక్షి డిజిటల్ న్యూస్ : భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రూపొందించిన నివేదిక ఒకటి కలకలం రేపుతోంది. ఏటా అమెరికా కమిషన్ వివిధ దేశాల్లో మైనార్టీలు, వారి మత విశ్వాసాలపై జరుగుతోన్న దాడుల గురించి ప్రస్తావిస్తూ నివేదికను రూపొందిస్తుంది. అయితే, భారత్‌పై ఈ నివేదిక తన అక్కసు వెళ్లగక్కింది. బీజేపీ సైద్ధాంతిక కర్తగా భావించే ఆర్ఎస్ఎస్‌తో పాటు భారత గూఢచారి విభాగంపై కూడా నిషేధం విధించాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా ఖండించడమే కాదు.. ఇది ఉద్దేశపూర్వక చర్య అని ఆరోపించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (USCIRF) సోమవారం విడుదల చేసిన నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తోన్నాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( RSS ), భారత గూఢచారి విభాగం రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌ (R &AW)లపై నిషేధం విధించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఈ నివేదికపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవాల ఆధారంగా కాకుండా అనుమానిత నివేదికలు, సిద్ధాంతపరమైన కథనాలు ఆధారంగా భారత్‌‌ను వక్రీకరిస్తూ నివేదిక రూపొందించిందని విమర్శించారు. ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ తాజా నివేదికను మేము గమనించాం. భారత్‌ గురించి ఉద్దేశపూర్వకంగా, పక్షపాతపూరిత వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘అమెరికా కమిషన్ భారత్‌పై ఇలాంటి నిందలు వేయడం ఇదే మొదటిసారి కాదు. అనేక ఏళ్లుగా భారత్‌పై బురద జల్లుతూనే ఉంది.. సందేహాస్పద వనరులు, సైద్థాంతిక కథనాలపై ఆధారపడి నివేదికలను రూపొందిస్తోంది.. ఇలాంటి నివేదికలు కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తాయి’’ అని జైశ్వాల్ వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చిన అమెరికా కమిషన్.. మతస్వేచ్ఛ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాణిజ్యం, ఆయుధ ఒప్పందాలు చేసుకోవాలని అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరడం గమనార్హం. ‘భారత్‌లో వ్యవస్థాగత మతపరమైన హింస’ (Systematic Religious Persecution in India) అనే నివేదికలో మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల దృష్ట్యా సామాజిక, రాజకీయ, నేర న్యాయ వ్యవస్థల స్థూల చిత్రాన్ని అందిస్తుందని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ వంటి జాతీయ వాద హిందూ సంస్థలతో అధికార బీజేపీతో ఉన్న సంబంధం.. అలాగే, మత స్వేచ్ఛ‌పై దాని ప్రభావాన్ని ఈ నివేదిక పరిశీలిస్తుంది. భారత రాజ్యాంగం మతస్వేచ్ఛకు కొంత వరకూ రక్షణ కల్పిస్తున్నప్పటికీ.. మైనార్టీల పట్ల వివక్షను పెంచేలా పనిచేస్తోందని నివేదిక ఆరోపించింది. అంతేకాదు, భారత్‌లో మతస్వేచ్ఛ క్షీణిస్తోందని, మతపరమైన మైనార్టీల ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపణలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *