అక్షర ఆయుధం: ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందేనని అన్నారు. ప్రాజెక్టుల భద్రత, నిర్మాణాల నాణ్యతలో రాజీపడే ప్రసక్తేలేదు అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణత్య పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన పునరావాస పనుల పైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. రకరకాల కారణాలతో రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సుదీర్ఘ కాలంపాటు ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్నాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారు.‘ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడం సరికాదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్లు ఎన్నికల హామీలుగా మిగిలిపోకూడదు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలి. అందుకే ప్రణాళికాబద్దంగా… ప్రాధాన్యతలను సిద్దం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘పోలవరం సహా రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్దతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నాం. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ… ఇప్పుడు పెద్ద పీట వేసి అవి పూర్తి అయ్యేలా చేసింది.. చేస్తోంది కూటమి ప్రభుత్వమే. ఇదే సమయంలో ప్రాజెక్టుల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండకూడదు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను. ఉన్నతాధికారులు మొదలుకుని.. క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బంది ఏ ఒక్కరూ అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటాను. ఉమ్మడి రాష్ట్రంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు… గత ప్రభుత్వ పాలనలోనూ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అయ్యేవారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకుపోయింది. గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చినా.. నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం.’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.