హార్వర్డ్ కోర్సు ఫీజు ఎవరు చెల్లించారు?..

ఆర్‌టీఐతో మళ్లీ రేవంత్ టూర్ వివాదం చర్చలోకి

అక్షర ఆయుధం: బీఆర్ఎస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి చదువుకున్నారని ఆరోపిస్తూ పోస్ట్ చేయడం ద్వారా ఈ వివాదం మరింత వేడెక్కింది. దీనికి ప్రతిస్పందించిన కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షం వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించిన ఖర్చులపై కొత్త రాజకీయ చర్చ ప్రారంభమైంది. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు ఒకవైపు ఉండగా, మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు మరో కోణాన్ని తీసుకువచ్చాయి. దీంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్‌కు చెందిన కరీం అన్సారీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన (పాలిటికల్) శాఖ కొన్ని డాక్యుమెంట్ వివరాలను అందించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1న జారీ చేసిన జీఓ ఆర్‌టీనెం.5 ప్రతిని అందజేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 జనవరి 25 నుంచి 30 వరకు అమెరికా పర్యటనకు వెళ్లినట్లు పేర్కొన్నారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహించిన “లీడర్‌షిప్ ఫర్ ది 21వ సెంచరీ” కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ జీఓలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ పర్యటనకు సంబంధించిన ఖర్చులను విద్యాశాఖ కింద ఉన్న సంబంధిత ఖాతా ద్వారా భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *