గల్ఫ్ దేశాలు భారతీయుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి’

ప్రధాని మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్ : అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకు పడుతుండగా.. అక్కడున్న భారతీయుల భద్రతపై అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయుల భద్రతకు హామీ ఇచ్చారు. అక్కడున్నప్రతీ భారతీయుడి ప్రాణం తమకు అత్యంత విలువైనదని, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని మన వారిని కాపాడేందుకు తాను స్వయంగా ఆయా దేశాల అధినేతలతో నిరంతరం మాట్లాడుతున్నట్లు చెప్పారు. గల్ఫ్ దేశాల నేతలు కూడా భారతీయుల భద్రతకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారని అన్నారు.ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే అక్కడ నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులను, ముఖ్యంగా కేరళీయులను సురక్షితంగా ఉంచడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గల్ఫ్ దేశాల నేతలతో కూడా తాను మాట్లాడానని.. వారు కూడా భారతీయుల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తామని తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే ఈ సున్నితమైన అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని చెబుతూ.. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం అవుతున్న వేళ.. అక్కడ ఉన్న భారతీయులపై దాని ప్రభావం పడకుండా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. “స్వయంగా నేనే ఆయా దేశాల అధినేతలతో నిరంతరం మాట్లాడుతున్నాను. వారు కూడా భారతీయుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. మన ఎంబసీలు 24 గంటలూ పనిచేస్తూ అక్కడి సోదర సోదరీమణులకు అండగా ఉంటున్నాయి” అని మోదీ పేర్కొన్నారు. కేరళ నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న నేపథ్యంలో.. వారి క్షేమం గురించి ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే భారతీయుల ప్రాణాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడు తోందని ప్రధాని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. “కాంగ్రెస్ ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తోంది. పరిస్థితులు విషమిస్తే రాజకీయంగా లబ్ధి పొందాలనేది వారి కుట్ర” అని మోదీ విమర్శించారు.కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై, అలాగే ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై కూడా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కేరళలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, డీఏ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, కేరళ ఆర్థిక వ్యవస్థను వామ పక్షాలు కుప్పకూల్చాయని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలను లెఫ్ట్ పార్టీలు ఎలా నాశనం చేశాయో దేశమంతా చూసిందని.. ఇప్పుడు కేరళలోనూ అదే జరుగుతోందని చెప్పారు. కేరళలో లెఫ్ట్‌ను విమర్శించే కాంగ్రెస్.. వారు అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో అభివృద్ధిని అటకెక్కించిందని మోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందని.. కర్ణాటకలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆయన గుర్తు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *