మోదీ-ట్రంప్ ఫోన్‌కాల్‌పై నివేదికలు: మస్క్ పాల్గొనడంపై కేంద్రం స్పందన

పయనించే సూర్యుడు న్యూస్ : గత నెల 28న ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌లు సంయుక్త దాడితో పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం రోజు రోజుకూ మహోగ్రరూపం దాల్చుతోంది. అయితే, ఈ ఉద్రికత్తలను తగ్గించి, యుద్ధాన్ని నిలిపివేసేందుకు ప్రయత్నించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం ప్రారంభంలో ఫోన్‌లో మాట్లాడారు. అయితే, ఈ సంభాషణల్లో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల ఫోన్‌ సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంభాషణలో ఎలాన్‌ మస్క్‌ కూడా పాల్గొన్నట్టు కథనలు వెలువడుతున్నాయి. తాజాగా, ఈ ప్రచారంపై స్పందించిన భారత్.. ప్రచారాన్ని ఖండించింది. ‘‘ఈ ప్రచారం మా దృష్టికి వచ్చింది. మార్చి 24న ప్రధాన మంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఫోన్‌‌లో మాట్లాడుకున్నారు.. పశ్చిమాసియా సంఘర్షణలపై ఇరువురూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇదొక వేదికైంది’’ అని ఈ మేరకు విదేశాంగశాఖ ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ట్రంప్‌, మోదీలు మధ్య జరిగిన తొలి సంభాషణ ఇదే. దీనిపై భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సైతం ప్రకటన చేశారు. ప్రపంచ చమురు సరఫరాకు ముఖ్యమైన హర్మూజ్‌ జలసంధి తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతో సహా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి గురించి చర్చించారని గోర్ తెలిపారు. అత్యంత సున్నితమైన జాతీయ భద్రతా సమస్యలపై మోదీ, ట్రంప్ చర్చించుకుంటుండగా.. ఎలాన్ మస్క్ కూడా కాల్‌లో జాయిన్‌ అయినట్లు అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్‌ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ట్రంప్‌, మోదీల మధ్య జరిగిన సంభాషణ గురించి అటు వైట్‌హౌస్, ఇటు భారత్ చేసిన ప్రకటనల్లో ఎక్కడా మస్క్‌ ప్రస్తావన లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తనకు ట్రంప్ ఫోన్ చేసిన మాట్లాడిన విషయం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై విలువైన అభిప్రాయాలను తాము పంచుకున్నట్టు చెప్పారు. శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొనసాగించాలని నిర్ణయించినట్టు మోదీ వెల్లడిచారు. అయినా సరే ఈ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా మోదీ, ట్రంప్ ఫోన్‌ కాల్‌లో మస్క్‌ పాల్గొనడంపై మీడియా అడిగిన ప్రశ్నకు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవెట్టీ సమాధానం దాటేశారు. ఇవి అనేక అనుమానాలకు తావిచ్చిన నేపథ్యంలోనే భారత ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేలా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో చర్చలపై ప్రకటన చేసిన ట్రంప్.. ఐదు రోజుల పాటు ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఆ గడువు శుక్రవారంతో ముగియడంతో మరో 10 రోజుల పాటు దీనిని పొడిగించినట్టు ప్రకటించిన ట్రంప్.. చర్చలకు ఇరాన్ వేడుకుంటోందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *