అక్షర ఆయుధం : మతమార్పిడి అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణకు సంబంధించి విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.మతమార్పిడి అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణకు సంబంధించి విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ కులాల (ఎస్సీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే ఆ కుల హోదాతో లభించే హక్కులు పొందలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీలు క్రైస్తవ మతంలోకి చేరి, ఆ మతాన్ని అనుసరిస్తున్నట్టు అయితే వారిని ఆ కుల సభ్యునిగా పరిగణించలేమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉమ్మడి గుంటూరు జిల్లాకుచెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులను ఆశ్రయించారు. తన గ్రామంలో ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్న తనపై రామిరెడ్డి, ఇతరులు పదేపదే దాడి చేశారని… తనపై, తన కుటుంబానికి బెదిరింపులకు పాల్పడ్డారని, కుల ప్రాతిపదికన దూషించారని ఆరోపించారు. ఆనంద్ ఫిర్యాదు మేరకు పోలసీులు పలువురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్లో ఉండగానే… ఈ కేసును కొట్టివేయాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గతేడాది మే నెలలో తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు పేర్కొంది. అటువంటి వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టంచేసింది.అయితే ఏపీ హైకోర్టు తీర్పును పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ మతాన్ని యాక్టివ్గా ఫాలో అయ్యేవారిని ఎస్సీ సామాజికవర్గ సభ్యుడిగా గుర్తించలేరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్ధించింది.హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) హోదాకు అర్హులు కారని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే వ్యక్తులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద రక్షణ పొందలేరని తీర్పు ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వ్యక్తులకు మాత్రమే ఎస్సీ హోదాను కోరే హక్కు ఉందని కూడా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ‘‘హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్డ్ కులంలో సభ్యుడిగా ఉండడు. ఏ ఇతర మతంలోకి మారినా షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారు” అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.