జనం న్యూస్: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం అయ్యింది. దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంలో భాగంగా దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు దివ్యాంగులతో కలిసి బస్సులోప్రయాణించారు. అనంతరం వారికి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి వారి బాగోగుల గురించి అడిగితెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా దివ్యాంగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరిలో ఇవాళ( మార్చి 18న) సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేశ్‌లు ప్రయాణించారు. పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దివ్యాంగులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందించేలా దివ్యాంగశక్తి పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రారంభించారు. అందరికీ సమాన అవకాశాలు అందించేలా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లకు, 100 శాతం మూగ, చెవిటి వారికి, అలాగే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్ ఆర్టీసీ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోంది. అయితే ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40 శాతం, లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీశక్తి పథకం కింద వర్తించే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఈ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కలగనుంది. 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకం అమలు చేయనున్నారు. సహాయకులతో కలిపి 12.76 లక్షల మంది లబ్దిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.మరోవైపు దివ్యాంగులకు సహయకులుగా వచ్చే వారికి 50 శాతం టిక్కెట్ రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 4 నుంచి 21 వర్గాలకు పథకం విస్తరణ. ఇప్పటివరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది. శారీరక-మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ది చేకూరుతుండగా పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా. ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్దిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు పెరిగనుంది. 7,264 బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈరోజు నుంచి స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీలో సుమారు 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింప చేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాస్‌లు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్‌ను సదరం యాప్‌తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో ఉచిత డిజిటల్ పాస్‌లు జారీ చేస్తారు.