పయనించే సూర్యుడు న్యూస్ : త్వరలో ప్రజా ప్రభుత్వంగా తమ ప్రభుత్వం మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా వివరించారని అన్నారు. త్వరలో ప్రజా ప్రభుత్వంగా తమ ప్రభుత్వం మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా వివరించారని అన్నారు. ఆ ప్రసంగం తమ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండే రోడ్మ్యాప్లాంటిదని పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించే దశ ముగిసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ప్రభుత్వం చేయబోయే పనులపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీలో చర్చించే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. చర్చలు పక్కదారి పట్టకుండా సభను సమర్థవంతంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సరైన సమయం ఇవ్వలేదు: ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమకు సభలో విషయాలపై మాట్లాడేందుకు కూడా సరైన అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, సీనియర్ నేత జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొత్తం సెషన్‌కు సస్పెండ్ చేసి సభకు హాజరుకాకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా శాసన సభ్యులు కూడా చర్చల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. సభా చర్చల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం అవసరమని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థ బలంగా ఉంటేనే రాజకీయాల్లో మనుగడ: అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సీఎం సంబంధిత ప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయాలని తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా జరిగే నష్టం కంటే వ్యవస్థకు జరిగే నష్టం పెద్దదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవస్థ బలంగా ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం అందరూ స్పందించాలని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి: ఇది తమ ప్రభుత్వం అని, ఇప్పుడే రూపొందించే రోడ్‌మ్యాప్ భవిష్యత్ ఎన్నికలకు కూడా ఎజెండాగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు తగు సూచించారు. అలాగే 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.