పయనించే సూర్యుడు న్యూస్ : ఇరాన్‌పై యుద్దం ప్రభావం భారతదేశంలోని చమురు,గ్యాస్ సరఫరాపై తీవ్రంగా చూపిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై సమీక్షించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా అడ్డుకోవాలని… ఎల్పీజీకి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సీఎం సూచించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని గ్యాస్ ఏజెన్సీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. గ్యాస్ డెలివరి సమయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యుద్ద ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు.. బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. BPCL, HPCL. IOCL సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సిలిండర్ సరఫరా సమయాన్ని నార్మల్సీకి తీసుకురావాలి అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.‘సిలిండర్ సరఫరా సమయాన్ని నార్మల్సీకి తీసుకురావాలని సూచించారు.‘ఇకపై ప్రతి రోజూ ఎల్పీజీ సరఫరా, నిల్వలు, బుకింగ్ లు వంటి వాటిపై పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాల్లోని రోజువారీ కార్యాకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.‘ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. మరికొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు మరిన్ని ఎల్పీజీ కేటాయింపులను కేంద్రం జరపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్ లైన్, ఇండక్షన్ స్టవ్స్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కష్టకాలంలో సమిష్టిగా పని చేయాలి ‘యుద్ద ప్రభావంతో రాష్ట్రంలో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. యుద్ద ప్రభావం దేశం మీద పడకుండా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారు. యుద్దం ప్రభావం ఉందని కుంగిపోవాల్సిన అవసరం లేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ‘కష్టకాలంలో సమిష్టిగా పని చేయాలి… అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను నిరంతరం గుర్తు పెట్టుకోవాలి… రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. అమరజీవి త్యాగ ఫలితంగా రాష్ట్రం వచ్చింది.. ఆయన స్పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. సమస్యలు వచ్చినా… ఇబ్బందులు వచ్చినా ప్రజలంతా సమిష్టిగా పని చేయాలి. వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని మోడీ పని చేస్తున్నారు… దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 చేసేలా మనం పని చేయాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు స్పూర్తిని నిరంతరం గుర్తుపెట్టుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగానే అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటైందని.. అమరజీవి త్యాగానికి గుర్తుగా ఆయన విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరు సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అమరావతిలో తొలి భారీ శిల్పంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నిలుస్తుంది. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ట్రస్ట్ పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.