ఉగాది వేడుకల్లో భారీ నిర్ణయం

2.5 లక్షల గృహ ప్రవేశాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

జనం న్యూస్: రాష్ట్రంపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారాలపై నిరంతరం ఆరా తీయాలని సూచించారు. మరోవైపు ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు చేయడమే లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంగళవారం వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై నిరంతరం పరిశీలించాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సంప్రదించి ప్రవాసాంధ్రుల క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విద్యుత్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి డిస్కంలను ఆదేశించారు. ఈ విషయంలో వినియోగదారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిస్కంలకు సూచించారు. అటు పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన అంశాల్లో సిలబస్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తృణ ధాన్యాలతో చిక్కీ లాంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *