తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు

బీఆర్ఎస్ సపోర్ట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

జనం న్యూస్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం నియమించిన కమిటీతో మంగళవారం టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కేటీఆర్ తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారత రాష్ట్ర సమితి నైతిక మద్దతు తెలుపుతుందని కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే, దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. వారికి వెంటనే అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే, వారికి పీఆర్సీతో పాటు డీఏలు, ఇతర బకాయిలు చెల్లించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశాలను ఇప్పుడు పట్టించుకోకుండా తప్పించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని… కేవలం డబ్బుల పంపిణీ పైన కాకుండా ఆర్టీసీ సమ్మె వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు, కానీ పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దని… పేద ప్రజలకు కార్ల లో పోయే స్థోమత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. 29 అంశాలు వెంటనే పరిష్కారం అయ్యేవేనని చెప్పుకొచ్చారు. సమ్మె విరమించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను విజ్ఞప్తి చేశారు. ‘‘ఆర్టీసీ సోదరులకు నా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృశ్య ఆర్టీసీ సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సమ్మె సమస్యకు పరిష్కారం కాదు..ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం ,గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉందని తెలిపారు. ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని చెప్పారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *