ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు: 45°C వరకు నమోదు, పలు జిల్లాలకు హెచ్చరికలు

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు * ఇవాళ 95 మండలాల్లో వేడి గాలులు

రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతోంది… అధికారుల నుంచి అలర్ట్

జనం న్యూస్ : ఏపీలో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో మాడుపగిలేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్దిరోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు.. ఒకవేళ వెళితే జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని.. వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 95 మండలాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. బుధవారం కడపలో అత్యధికంగా 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 44.1 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ ప్రజలు ఎండ తీవ్రత సమాచారం కోసం ఏపీఎస్డీఎంఏలోని కంట్రోల్‌రూమ్‌ 112 నంబర్‌కు.. 1070, 1800 4250101 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఏపీలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాలకు వెళ్లిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఏపీలో ఓ వైపు ఎండలు, మరోవైపు వేడిగాలులు, ఇటు ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజులుగా సాయంత్రం వరకు ఎండల తీవ్రత కనిపిస్తోంది.. ఆ తర్వాత వాతావరణం మారిపోయి ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. ఈ విభిన్నమైన వాతావరణంతో ఉక్కపోత అనిపిస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఎండ దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ వస్తే కనుక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *