జనం న్యూస్ : భారత రక్షణ రంగంలోకి మరో అరుదైన ఆయుధం వచ్చి చేరింది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను చిత్తు చేసేందుకు అత్యవసర ప్రాతిపదికన వందలాది ఆత్మాహుతి డ్రోన్లను స్వదేశీ సాంకేతికతో తయారు చేశారు. సూరత్‌కు చెందిన ‘ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ’ సంస్థ రక్షణ శాఖతో కుదుర్చుకున్న రూ.10 కోట్ల ఒప్పందాన్ని కేవలం రెండు నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేసి భారత ఆర్మీ ఉత్తర కమాండ్ చెంతకు చేర్చాయి. గాలిలోనే ఉండి లక్ష్యాన్ని వేటాడి, ఆత్మాహుతి దాడి చేసే ఈ సాంకేతికత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వారందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అసలైన సాంకేతిక ఆయుధం చేరింది. ఆధునిక యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించే.. ఆత్మాహుతి డ్రోన్లు ఆర్మీ నార్తర్న్ కమాండ్ చెంతకు చేరాయి. సరిహద్దుల్లో ప్రాణనష్టం జరగకుండా శత్రువులను తుదముట్టించే లక్ష్యంతో.. కేంద్ర రక్షణ శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ వందలాది డ్రోన్లను విజయవంతంగా అందజేసింది. రెండు నెలల్లోనే డెలివరీ.. గతేడాది పహల్గాం వంటి ఘటనల నేపథ్యంలో సరిహద్దు రక్షణపై భారత్ మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అత్యవసర కొనుగోలు కింద రూ. 10 కోట్ల ఒప్పందంతో ఈ డ్రోన్ల తయారీ బాధ్యతను స్వదేశీ సంస్థలకు అప్పగించింది. ముఖ్యంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్ కమాండ్‌కు డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించనప్పటికీ.. ఇవి ఉత్తర సరిహద్దుల్లో భారత సైనిక బలాన్ని రెట్టింపు చేస్తాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలేమిటీ కాముకాజి ప్రత్యేకత? కామికాజ్ అనేది జపనీస్ పదం కాగా.. దాని అర్థం దివ్య పవనం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తమ విమానాలతో శత్రు లక్ష్యాలపై దాడులు చేసిన ఆత్మాహుతి పైలెట్లను గుర్తు చేసేలా ఈ పేరు పెట్టారు. అయితే ఇవి ఒకసారి వెళ్తే మళ్లీ తిరిగ రాలేవు. కానీ శత్రు సైన్యాలను పూర్తిగా నాశనం చేయగలవు. కామికాజ్ డ్రోన్లలో మనుషులు ఎవరూ ఉండరు. దీనికి ప్రత్యేకమైన గాగుల్స్ ఉంటాయి. దీని ద్వారానే లైవ్, రియల్ టైమ్ వీడియోను రికార్డు చేస్తుంది. అంతేకాకుండా గైడెడ్ మిస్సైళ్ల కంటే వీటి ఖర్చు తక్కువ కాగా.. పది నిమిషాల్లోనే ఇది అనుకున్న లక్ష్యాలను చేధిస్తుంది. ముఖ్యంగా ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. 10 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇట్టే ఛేదించగలవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత గైడెన్స్ సిస్టమ్ సహాయంతో.. జీపీఎస్ లేని ప్రాంతాల్లో కూడా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని అంచనా వేసి దాడులు చేస్తాయి. అంతేకాకుండా సుమారు 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ డ్రోన్లు.. శత్రువుల బంకర్లు లేదా వాహనాలపై ఆత్మాహుతి దాడి చేసి వాటిని సర్వనాశనం చేస్తాయి. మైనస్ 35 డిగ్రీల గడ్డకట్టే చలిలో కూడా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన ప్రాంతాల్లో నిఘాకు, దాడులకు ఇవి సరైన ఆయుధాలు. అంతేకాకుండా సాధారణ సైనిక దళాలు వెళ్లలేని అటవీ ప్రాంతాలు లేదా ఎత్తైన కొండల మధ్య దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఈ డ్రోన్లు గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి. గరిష్టంగా 2.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగే ఈ డ్రోన్లు, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి తక్షణ ముప్పులను ఎదుర్కోగలవు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సాంకేతికత భారత సైన్యానికి అదనపు బలాన్ని ఇవ్వడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గించింది.