ఇంధన నిల్వలపై మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ

17 రోజులు సరిపడా స్టాక్ అందుబాటులో

జనం న్యూస్: ‘రాష్ట్రంలో వ్యాపార వర్గాలకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 70 శాతం అదనపు కోటాను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. వాణిజ్య అవసరాలను జేసీలకు తెలియజేసి గ్యాస్ పొందొచ్చు అని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 రోజులకు సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయి అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు సంబంధించిన కమర్షియల్ గ్యాస్ బుకింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్రం శుభవార్త చెప్పిందని, 70 శాతం మేర గ్యాస్ అదనపు కోటాను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటును కేంద్రం కల్పించిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వ్యాపారులు తమ అసోసియేషన్ పరిధిలో గ్యాస్ ఎంత మేర అవసరమో జిల్లా జాయింట్ కలెక్టర్లకు చెబితే, ప్రాధాన్యత ప్రకారం గ్యాస్ బండలను కేటాయించడం జరుగుతందని చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరా తీరు, వాస్తవ పరిస్థితి, అందుబాటులో ఉన్న నిల్వలపై మంగళవారం మంత్రి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీలు, స్టేట్ కోఆర్డినేటర్లతో ప్రత్యేకంగా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకొని, తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సగటున 1.80 లక్షల గ్యాస్‌బుకింగ్. ‘రాష్ట్రంలో సోషల్ మీడియా వదంతులు వేగంగా విస్తరిస్తున్నాయి తప్పితే ఎక్కడా కొరత లేదు. గృహ అవసరాలకు సంబంధించి కొన్ని అనవసర భయాల వల్ల ఎక్కువ బుకింగ్ లు ఇటీవల జరిగాయి. దీంతో సరఫరాలో కాస్త లోపం వచ్చింది. దాన్ని మళ్లీ గాడిన పెట్టే చర్యలు వేగంగా జరుగుతున్నాయి’మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘రాష్ట్రంలో సగటున రోజువారీ 1.80 లక్షల గ్యాస్ బుకింగ్ లు జరిగేవి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యుద్ధం వదంతులతో ఒకే రోజు 5 లక్షల బుకింగ్ లు జరిగాయి. దీంతో సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో బుకింగ్ చేసుకున్న వారికి కెపాసిటీ మించి డెలివరీలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. క్రమంగా బ్యాక్ ల్యాగ్ బుకింగ్ లు పూర్తి అయి, పరిస్థితి మెరుగవుతోంది. కేంద్రం కూడా అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువులో మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం తీసుకొచ్చింది. దీంతో గ్యాస్ బుకింగ్ లు మెల్లగా సాధారణ స్థాయికి వస్తున్నాయి’అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *