బీజేపీలోకి ఆప్‌కు చెందిన 7 ఎంపీల విలీనం

రాజ్యసభలో బలం పెరుగుదల

అక్షర ఆయుధం ; రాజ్యసభలో బీజేపీలో ఏడుగురు ఆప్ ఎంపీల విలీనం అధికారికంగా పూర్తైంది. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్… బీజేపీలోకి ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల విలీనాన్ని అధికారికంగా ఆమోదించారు. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు పెరిగింది. ఇటీవల ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమను బీజేపీలో విలీనం చేయాలని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు. విలీనం పూర్తయిన తర్వాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని అభ్యర్థించారు. అయితే వారి విజ్ఞప్తిని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. దీంతో ప్రస్తుతం రాజ్యసభ వెబ్‌సైట్‌లో ఆ ఏడుగురు ఎంపీల పేర్లు బీజేపీ సభ్యుల జాబితాలో కనిపిస్తున్నాయి. ఆ ఏడుగురు ఎంపీలలో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, విక్రమ్‌జిత్ సాహ్నీ, స్వాతి మాలివాల్, రాజేందర్ గుప్తాలు ఉన్నారు. ప్రస్తుతం వారు రాజ్యసభలో బీజేపీ ఎంపీలుగానే కొనసాగనున్నారు. ఇదిలాఉంటే, పార్టీ ఫిరాయించిన ఆ ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం రాజ్యసభ ఛైర్మన్‌కు ఒక పిటిషన్‌ను సమర్పించింది. రాజ్యసభలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఇటీవల ఆప్‌పను వీడి బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాను ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు ఒక పిటిషన్ సమర్పించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఇదిలాఉంటే, తాము నిబంధనల ప్రకారమే నడుచు కుంటున్నామని ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. ‘‘రాజ్యసభలోని ఆప్‌కు చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులమైన మేము, భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనమవ్వాలని నిర్ణయించుకున్నాము’’ అని రాఘవ్ చద్దా విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో విలీనమవ్వాలని నిర్ణయించుకున్న రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఎంపీలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం స్వాగతం పలుకుతున్నట్టుగా పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్… ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో విలీనమవడాన్ని ఆమోదించారని తెలిపారు. ఇప్పుడు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీలు బీజేపీ పార్లమెంటరీ పార్టీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. రాజ్యసభలో పెరిగిన ఎన్డీయే బలం… ఏడుగురు ఎంపీల విలీనంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. దీంతో ఎన్డీయే బలం 148కి చేరింది. రాజ్యసభలో ఎన్డీయే బలం… బీజేపీ 113, టీడీపీ 2, జేడీ (యూ) 4, శివసేన 2, ఆర్‌ఎల్‌డీ 1, జేడీ(ఎస్) 1, ఏజీపీ 1, ఎన్‌సీపీ 4, ఏఐఏడీఎంకే 5, ఆర్‌పీఐ (అథవాలే) 1, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఉపేంద్ర కుష్వాహా పార్టీ) 1, యునైటెడ్ పీపుల్స్ పార్టీ (లిబరల్) 2, స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ, ఎంఎన్ఎఫ్ 1, ఎన్‌పీపీ 1, పీఎంకే 1 ఉన్నారు. బీజేపీలో చేరకపోయినప్పటికీ నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా సాధారణంగా అధికార పక్షానికే ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *